మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చుట్టూ వివదాలు ఆగడం లేదు. తాజాగా భూమా అఖిలప్రియపై భూమా కిషోర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అఖిలప్రియ అరాచకాలపై చర్చకు సిద్ధమని కిషోర్‌రెడ్డి సవల్ విసిరారు. ఆయన కామెంట్స్‌పై అఖిల ప్రియ సైతం అంతేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
Kishore Reddy - Akhila Priya
ఆళ్లగడ్డలో అన్నాచెల్లెల్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. చూసుకుందాం.. తేల్చుకుందాం… అవసరమైతే చర్చకైనా సిద్ధమంటూ పొలిటికల్ హీట్ పెంచారు. దీంతో ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటూ తెగ టెన్షన్ పడుతున్నారు పోలీసులు. ఆళ్లగడ్డలో భద్రత మరింత పెంచారు.
ఆళ్లగడ్డలో ఎక్కడ చూసినా అవినీతే అంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత కిషోర్‌రెడ్డి. మట్టి మాఫియా, భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందంటూ ఫైర్ అయ్యారు. భూమా అఖిలప్రియ అరాచకాలపై అవసరమైతే చర్చకైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు.
భూమా కిషోర్‌రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన అఖిలప్రియ… సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆళ్లగడ్డలో అవినీతిపై చర్చించడానికి ఎక్కడికో ఎందుకు కిశోర్‌రెడ్డి ఇంటికే వెళ్తానన్నారు. ధైర్యం ఉంటే చర్చలో పాల్గొనాలన్నారు.
ఇక అన్నాచెల్లెల్ల మాటల యుద్ధంతో ఆళ్లగడ్డలో పొలిటికల్ కాక రేగింది. అన్నట్లుగానే కిశోర్‌రెడ్డి ఇంటికి అఖిలప్రియ వస్తారనే అనుమానంతో ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. డిబేట్‌తో శాంతిభద్రతల సమస్య వస్తుందంటున్నారు పోలీసులు. అఖిలప్రియపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని భూమా కిషోర్‌రెడ్డికి పోలీసులు సూచించారు. అయితే… ఆయన మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లున్నారు. చర్చ పెట్టి తీరాల్సిందేనంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి