సాయిపల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటించిన సినిమ అమరన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. మేజర్ మకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
ముఖ్యంగా సాయిపల్లవి, శివ కార్తికేయన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎమోషన్ సన్నివేశాల్లో సాయిపల్లవి అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి విఘ్నేశన్ అనే ఓ ఇంజనీర్ విద్యార్థి లీగల్ నోటీసులు పంపించాడు. చిత్ర యూనిట్ వల్ల తనకు ఇబ్బంది ఎదురైందని నష్టపహారం కింద రూ. 1.1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇంతకీ ఆ యువకుడు ఎందుకు ఇలా చేశాడనేగా మీ సందేహం.
ఈ సినిమాలో హీరోకు సాయి పల్లవి తన ఫోన్ నెంబర్ ఇచ్చే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఇందుకోసం చిత్ర యూనిట్ ఓ నెంబర్‌ను ఉపయోగించారు. ఇంకేముందు సినిమా చూసిన అభిమానులు వెంటనే ఆ ఫోన్ నెంబర్‌కు తెగ ఫోన్‌లు చేయడం మొదలు పెట్టారు. సాధారణంగా ఫోన్ నెంబర్స్ చెప్పే సమయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని నెంబర్స్ మ్యూట్ చేయడం కానీ అందుబాటులో లేని నెంబర్స్ కానీ ప్రస్తావిస్తుంటారు. అయితే అమరన్ చిత్ర యూనిట్ మాత్రం నేరుగా నెంబర్ చెప్పేసింది.
దీంతో చిరాకుగా పడ్డ ఆ కుర్రాడు చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపాడు. వరుస ఫోన్ కాల్స్, మెసేజ్‌ల కారణంగా తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండా పోయిందని విఘ్నేశన్ నోటీసులో పేర్కొన్నాడు. దీనివల్ల తాను కుటుంబసభ్యులతో సరిగా సమయాన్ని గడపలేకపోతున్నానని వాపోయాడు. తన అనుమతి లేకుండా ఫోన్ నంబర్ ఉపయోగించినందుకు చిత్రబృందం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. చూడాలి మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..