అమరావతి రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టింది. 2014-19 మధ్యలో టిడిపి ప్రభుత్వ హయాంలో రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణం శరవేగంగా మొదలైంది. ఇందులో భాగంగానే సచివాలయ ఐకానిక్ భనవాల కోసం పనులు ప్రారంభించి ర్యాప్ట్ ఫౌండేషన్ వేశారు. ఈ ఫౌండేషన్ వేయడానికి పెద్ద పెద్ద గుంతలు తవ్వారు. ర్యాప్ట్ ఫౌండేషన్ పూర్తయ్యే సమయానికి ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని పనులు ఎక్కడివక్కడే నిలిచి పోయాయి.
దీంతో ర్యాప్ట్ ఫౌండేషన్ గుంతల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. గత ఐదేళ్లలో ఎవరూ వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో తటాకాలుగా మారిపోయాయి. వీటిల్లోకి పెద్ద ఎత్తున నీరు నిలిచి పోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌండేషన్ భద్రతపై ఐఐటి బృందంతో నివేదిక తెప్పించుకుంది. పౌండేషన్ కు ఎటువంటి ఇబ్బంది లేదని తిరిగి నిర్మాణాలు ప్రారంభించవచ్చని నిపుణుల బృందం స్పష్టం చేసింది. వెను వెంటనే కూటమి ప్రభుత్వం ర్యాప్ట్ ఫౌండేషన్ పైనే శాశ్వత సచివాలయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ నెల చివరి నుండి పనులు ప్రారంభించేలా CRDA ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ర్యాఫ్ట్ పౌండేషన్ గుంతల్లో నిలిచిపోయిన నీటిని తొలగించాలని సిఆర్ఢియే నిర్ణయం తీసుకొని నీటిని తోడటం మొదలు పెట్టారు.
ట్రాక్టర్ మోటార్లు ద్వారా గత నెల రోజుల నుంచి నీటిని తోడి పాలవాగులోకి పోస్తున్నారు. అటునుండి ఆ నీటిని క్రిష్ణానదిలోకి వదులుతున్నారు. అయితే సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున నీటి తొలగింపు మొదలైంది. తటాకాలుగా మారిన గుంతల్లో నీరు తగ్గిపోవడంతో చేపలు బయట పడ్డాయి. ఒక్కో చేప పది కేజీల వరకూ తూగుతుంది. టన్నుల కొద్దీ చేపలు గుంతల్లో బయటపడుతుండటంతో స్తానికులు వాటి కోసం ఎగబడుతన్నారు. కొంతమంది పెద్ద పెద్ద వలలు తీసుకొచ్చి చేపలను పడుతున్నారు. చేపలు సైజ్ పెద్దగా ఉండటంతో పాటు బొచ్చ, రాగండి వంటి రకాలు కూడా కావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. దీంతో ఆ ప్రాంత మంతా సందడిగా మారింది. భారీ చేపలను బైక్‌లకు కట్టుకొని తీసుకెళ్తున్నారు. అయితే నీటిని పూర్తిగా తోడేయడంతో ర్యాప్ట్ పౌండేషన్ పూర్తిగా బయటపడింది. మరో రెండు మూడు రోజుల్లో నీటిని తోడే ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి