అమరావతి వేదికగా కేంద్రహోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఎన్డీఏ నేతల కీలక భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అమిత్‌షా డిన్నర్ మీటింగ్ గంటన్నర సేపు కొనసాగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సహా పలువురు మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్ షాతో చర్చించారు. ఎన్డీఆర్‌ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఏపీకి వచ్చిన అమిత్‌షాకి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు లోకేశ్, అనిత, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న అమిత్ షాకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘనస్వాగతం పలికారు. అక్కడ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో కలిసి గంటన్నరపాటు డిన్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఏపీకి కేంద్రం చేస్తున్న సాయంపై అమిత్‌షాకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. ఏపీకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో అమిత్ షా, చంద్రబాబు మధ్య అరగంటకుపైగా ఏకాంత భేటీ జరిగింది. వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ఆకాంక్ష
ఏపీలోని తాజాగా రాజకీయ పరిణామాలతో పాటు.. నేషనల్ పాలిటిక్స్‌పైనా అమిత్ షా భేటీలో ఎన్డీఏ కీలక నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్‌కు భారతరత్న పెండింగ్‌లో ఉందని బీజేపీ ఏపీ చీప్ పురందేశ్వరి కేంద్రమంత్రి అమిత్ షాకి గుర్తు చేశారు. దాంతో.. ఎన్టీఆర్ వర్థంతి అంశాన్ని అమిత్ షా దగ్గర ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఆకాంక్షించారు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి, అంతర్ రాష్ట్ర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అమిత్ షానే సీఎం చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక.. సీఎం చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల డిన్నర్ భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. రాత్రి అక్కడే బస చేశారు.
ఇవాళ గన్నవరంలో NDRF, SDRF క్యాంప్‌ల ప్రారంభం
ఇక.. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ గన్నవరంలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో అమిత్ షా, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. గన్నవరంలో NDRF, SDRF క్యాంప్‌లను ప్రారంభిస్తారు.
ఆర్థిక ప్యాకేజీ ప్రకటనతో కేంద్రంపై ప్రశంసల జల్లు
ఇదిలావుంటే.. ఏపీ అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పదేపదే చెబుతున్న కేంద్రం.. తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అపోహల్ని తొలగించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి కేంద్రం 11,140 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. ఆంధ్రా సెంటిమెంట్ గౌరవిస్తున్నామని పీఎం మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆర్థిక ప్యాకేజీ ప్రకటనతో కేంద్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్‌షాకి కృతజ్ఞతలు చెప్తూ కూటమి ప్రభుత్వం గ్రాండ్ వెల్కమ్ పలికింది. అయితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని.. అందుకే ప్యాకేజీ ప్రకటించామని అమిత్ షా సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..