తంబళ్లపల్లె సమీపంలో ఓ రైతు పొలం దున్నుతుండగా ఏదో రాయి మాదిరిగా తగిలినట్లు అనిపించింది. దీంతో అనుమానం వచ్చి.. ఆగి చూడగా.. అదేదో విగ్రహంలా అనిపించింది.. మట్టిని తొలగించి.. శుభ్రపరచగా.. అది పురాతన మహావిష్ణువు విగ్రహంగా వెల్లడైంది. దీంతో విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆ ప్రాంతానికి వస్తున్నారు.
Farm Land (Representative image)
అన్నమయ్య జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. పొలం దున్నుతుండగా పురాతన విష్ణు మూర్తి విగ్రహం బయటపడింది. తంబళ్లపల్లె మండలం కోటకొండ పంచాయతీ ఏటగడ్డపల్లె ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ మహా విష్ణువు విగ్రహం దాదాపు మూడు అడుగుల ఎత్తు ఉంది. దానిపై ఉన్న మట్టిని తొలగించి శుభ్రపరిచారు. ఈ విషయం తెలియడంతో ప్రజలు భారీగా తరలివచ్చి.. విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు.. స్వామివారి పూజలు చేస్తున్నారు. ఈ విషయం స్థానిక అధికారులకు తెలియడంతో స్పాట్‌కు వచ్చి విజిల్ చేశారు. వ్యవసాయ క్షేత్రంలో బయటపడిన ఆ విగ్రహాన్ని పరిశీలించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆ చేనును ఎవరూ దున్నకూడదని తహసీల్దార్ ఆదేశించారు.
అయితే కొద్ది రోజుల క్రితం మండలంలోని కోటకొండలో కూడా.. మరో రెండు దేవతా విగ్రహాలు సైతం బయటపడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. మద్దిరాళ్లపల్లెకు చెందిన రంగారావు పొలాన్ని వెంకటేష్ అనే రైతు కౌలుకు తీసుకుని సాగు చేస్తుండగా ఈ విగ్రహాలు బయటపడినట్లు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో పురాతన ఆలయాలకు సంబంధించిన అవశేషాలు ఉండి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఆ ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు పరిశీలన జరపనున్నారు. పొలంలో బయటపడిన ఈ మహా విష్ణువు విగ్రహం ఏ కాలం నాటిదో పురావస్తు పురావస్తు శాఖ వారు వెల్లడించాల్సి ఉంది. ఈ విగ్రహం బయటపడిన అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.