ఈ మధ్యకాలంలో చేతిలో మొబైల్, కాళ్లకు చెప్పులు.. ఇవి రెండూ లేకపోతే ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేకపోతున్నారు జనాలు. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులేసుకుని తిరుగుతుంటారు. అలాంటిది ఓ గ్రామంలోని ప్రజలెవ్వరూ కూడా అస్సలు చెప్పులు ధరించరు. ఆ గ్రామప్రజలు ఊరిలోకి రావాలంటే.. పొలిమేరలోనే చెప్పులు విడిచిపెట్టేసి వస్తారు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా.. ఇది ఆ ఊరిలోని ఆచారం. మరి ఇంతకీ ఆ గ్రామం ఏంటి.? ఎక్కడుంది.? వారి సంప్రదాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి 50 కిమీ దూరంలో ఉన్న ఉప్పరపల్లి పంచాయితీ వేమన ఇండ్లు గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. ఈ గ్రామంలో మహా అయితే 10 నుంచి 15 ఇళ్లు ఉంటాయి. ఆ ఇళ్లలోని పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవ్వరూ కూడా చెప్పులు ధరించరు. ఆ గ్రామానికి కలెక్టర్, సీఎం వచ్చినా ఊరవతల చెప్పులు వదిలి రావాల్సిందే. ఇది వారి తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఆ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే వెంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తితోనే వారు చెప్పులు ధరించరు. బయట ఫుడ్ అసలు తినరు. స్కూళ్లో మధ్యాహ్న భోజనం కూడా ముట్టరు. బయటి వ్యక్తులను తాకరు. ఎవరైనా వీరిని తాకినా వెంటనే స్నానం చేస్తారు. అలాగే ఇంట్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా స్నానం చేయాల్సిందే.
అటు అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రులకు వెళ్లరు. ఇక నెలసరి మహిళల కోసం ఈ ఊరి ప్రజలు.. ఊరి పొలిమేరలో రెండు గృహాలు నిర్మించారు. పీరియడ్స్ వచ్చిన మహిళలు వారం పాటు అక్కడే ఉంటారట. ఆ ఇంటి యజమాని వారికి వంట చేసుకుని తీసుకోస్తారట. కాగా, వీరి ఆచారాలు, సంప్రదాయాలపై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. కాలం మారిపోయినా.. ఇంకా ఇలాంటి మూడనమ్మకాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి