చెట్టాపట్టాలేసుకొని సరదా సరదాగా పొలం పనులకు వెళ్లిన భార్యాభర్తల్లో భార్య శవమై పంటపొలాల్లో కనిపించగా భర్త ఆచూకీ మాత్రం లభ్యమవ్వలేదు. విగతజీవిగా పడి ఉన్న మహిళను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
Andhra Crime News
G Koteswara Rao | Edited By: Ram Naramaneni
Updated on: Feb 08, 2025 | 11:45 AM
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చుక్కపేటలో ఏకల సత్యం.. గౌరమ్మ అనే మహిళను సుమారు 30 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు కుమారుడు గణేష్ సి ఎస్ ఎఫ్ కానిస్టేబుల్‌గా జార్ఖండ్ లో పనిచేస్తుండగా, కుమార్తెకు వివాహమైంది. అయితే వివాహం జరిగి ముప్పై ఏళ్లు అవుతున్నా భార్యాభర్తల మధ్య మాత్రం నిత్యం వివాదాలు జరుగుతుండేవి. చీటికిమాటికి గొడవపడుతూ భార్య గౌరమ్మపై భర్త సత్యం అనేకసార్లు దాడి చేశాడు. వీరి మధ్య వివాదాలు చూసిన కుమారుడు గణేష్ తాను ఉద్యోగం చేస్తున్న జార్ఖండ్ కి తల్లిదండ్రులను తీసుకొని వెళ్లాడు. కొన్ని రోజులు కుమారుడి వద్ద ఉన్న భార్యాభర్తలు ఇటీవల అక్కడ నుంచి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. అలా గ్రామానికి వచ్చిన తర్వాత కూడా వీరి మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న కుమారుడు తిరిగి తల్లిదండ్రులని తనతో పాటు తీసుకొని వెళ్లేందుకు గ్రామానికి వచ్చాడు. మరికొద్ది రోజుల్లో తల్లిదండ్రులకు నచ్చజెప్పి తనతోనే తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలోనే భార్యాభర్తలు ఇద్దరు కలిసి గుచ్చిమి సమీపంలో పొలం పనులకు వెళ్లేందుకు బయలుదేరారు. అలా వెళ్తుండగానే మార్గమధ్యలో పామాయిల్ తోటలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. కొంతసేపు గొడవ పడ్డారు. దీంతో భర్త సత్యం పట్టరాని కోపంతో తన చేతిలో ఉన్న కొడవలితో భార్యపై దాడికి దిగాడు. తీవ్ర గాయాలతో తనని వదలమని ప్రాధేయపడ్డా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తీవ్ర రక్తస్రావంతో నిస్సహాయంగా అక్కడే పడిపోయింది గౌరమ్మ. అయితే కొన ఊపిరితో ఉన్న గౌరమ్మ ఇంకా చనిపోలేదని గమనించి గొంతు నులిమి చంపాడు. ఇంతలో స్థానికులు అటుగా వస్తున్నట్లు గమనించిన సత్యం అక్కడ నుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుమారుడు గణేష్ తల్లి మృతదేహం వద్దకు చేరుకొని తల్లిని పట్టుకొని గుండెలవిసేలా రోదించాడు. పోలీసులు ఘటనాస్థలంలో ఉన్న కొడవలిని స్వాధీనం చేసుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం నిందితుడు సత్యం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి