చక్కెర కేవలం వంటకు మాత్రమే కాదు. చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగకరమైంది. ఇంట్లోనే సులభంగా స్క్రబ్‌లను తయారు చేసుకుని చర్మాన్ని మెరిసేలా, మృదువుగా మార్చుకోవచ్చు. మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రోడక్ట్‌ల కన్నా.. సహజమైన చక్కెర స్క్రబ్‌లు ఆరోగ్యానికి మంచివి. ఇంట్లోనే చక్కెర స్క్రబ్‌లు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ, చక్కెర, కొబ్బరి నూనె స్క్రబ్
కాఫీ పొడి, చక్కెర, కొబ్బరి నూనెను కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసుకుని ముఖం, మెడ, చేతులపై నెమ్మదిగా రుద్దాలి. ఇది చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలను తొలగించి మృదువుగా, మెరిసేలా చేస్తుంది. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి ఉజ్వలమైన కాంతిని ఇస్తాయి.
ఓట్స్ షుగర్ స్క్రబ్
జిడ్డు చర్మం, మొటిమల సమస్యతో బాధపడేవారు ఓట్స్ పొడి, చక్కెర, ఆలివ్ నూనె లేదా తేనెను కలిపి ఉపయోగించాలి. ఈ స్క్రబ్ చర్మంపై ఉండే అదనపు నూనెను తొలగించడంతో పాటు మొటిమల సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి.
గ్రీన్ టీ షుగర్ స్క్రబ్
చర్మంపై పేరుకుపోయే మృత కణాలను తొలగించడానికి గ్రీన్ టీ, చక్కెర, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో తయారైన స్క్రబ్ బాగా పనిచేస్తుంది. దీనిని ముఖం, మెడ, వీపు భాగాల్లో రుద్దితే చర్మం తాజాగా మారి సహజమైన కాంతిని పొందుతుంది.
నల్లదనాన్ని తగ్గించే స్క్రబ్
మోచేతులు, మోకాళ్ల వద్ద నల్లబడిన చర్మాన్ని శుభ్రం చేయడానికి ఆలివ్ ఆయిల్ షుగర్ స్క్రబ్ ఉపయోగంగా ఉంటుంది. చక్కెర మృతకణాలను తొలగించగా ఆలివ్ నూనె చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. ఇది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
చక్కెరతో సహజమైన నిగారింపు
చక్కెరను చర్మ సంరక్షణలో ఉపయోగించడం ద్వారా సహజమైన కాంతిని పొందవచ్చు. రసాయనాలతో నిండిన క్రీమ్స్ కన్నా.. ఇంట్లో ఉండే చక్కెరతో తయారు చేసుకునే స్క్రబ్‌లు చాలా మేలైనవి. మరి ఇంకెందుకు ఆలస్యం.. చక్కెరతో స్క్రబ్‌లు ట్రై చేసి మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోండి.