తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బర్డ్‌ఫ్లూ భయాందోళన కలిగిస్తోంది. పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఏపీలో వేలాది కోళ్లు మృతి చెందాయి. కోళ్లకు వైరస్ సోకుతుండటంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. దీంతో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఈ బర్డ్ ఫ్లూ భయంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ నుంచి తెలంగాణకు భారీగా కోళ్లు సరఫరా అవుతున్నాయి. దీంతో తెలంగాణ అధికారులు రాష్ట్రానికి రాకుండా బర్డర్‌లో అడ్డుకుంటున్నారు.
కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లుగా గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఏపీ – తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్‌లోని అంతర్‌రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కోళ్ల వాహనాలు వస్తుంటే వెంటనే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు తెలంగాణ అధికారులు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసిన అధికారులు ఏపీ నుంచి వచ్చిన రెండు కోళ్ల లారీలను సైతం అడ్డుకుని వెనక్కి పంపించారు. గత వారం రోజులుగా రోజుకు రెండు, మూడు లారీలను సైతం వెనక్కి పంపిస్తున్నారు.
భారీగా తగ్గిన చికెన్, గుడ్లు ధరలు
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవ్వరు కూడా చికెన్ తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో కోళ్ల గిరాకీ భారీగా తగ్గింది. ఏపీలో ఇప్పటికే వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ భయంతో ఏపీ, తెలంగాణలో చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇది వరకు కిలో చికెన్ ధర రూ.220 నుంచి రూ.230 వరకు ఉండగా, ప్రస్తుతం భారీగా తగ్గింది. మంగళవారం రూ.150 నుంచి రూ.170 వరకు విక్రయిస్తున్నారు.బర్డ్‌ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ జోలికి పోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు ధరలు భారీగా తగ్గాయి. బర్డ్‌ఫ్లూ కేసులు వచ్చిన 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటించారు. కోడిగుడ్డు ధర 6 రూపాయలు ఉండగా, ప్రస్తుతం తగ్గింది. తెలంగాణలోని ప్రాంతాల్లో చికెన్ ధర భారీగా తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో సైతం ధరలు దిగి వచ్చాయి.
ఉడికించిన మాంసం, గుడ్లు తినవచ్చా?
అయితే కోళ్లకు వైరస్ కారణంగా చికెన్ తినేందుకు భయపడుతున్నారు. మరి ఉడికించిన చికెన్, గుడ్డును తినొచ్చా? లేదా? అనే సందేహం కోలుగుతోంది. ప్రజలు చికెన్, గుడ్డు తిసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని, అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకదని నిపుణులు చెబుతున్నారు. కోడిమాంసం, గుడ్లను మనం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం కాబట్టి అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి