దేశంలో బీజేపీ హవా నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి.. పదకొండేళ్లు గడుస్తున్నా.. బీజేపీ గ్రాఫ్ పైపైకి వెళ్తోంది తప్ప.. ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ప్రధాని మోదీ నేతృత్వంలో కమల వికాసం నడుస్తూనే ఉంది. లేటెస్టుగా ఢిల్లీ కూడా తమ ఖాతాలో పడడంతో.. 15 రాష్ట్రాలకు పెరిగింది బీజేపీ అధికారం. NDA కాకుండా కేవలం బీజేపీ 15 రాష్ట్రాల్లో సత్తా చాటింది. ఎన్డీఏ కూడా కలుపుకుంటే.. 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కాగా.. ఢిల్లీలోని 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించాయి.. కాంగ్రెస్ ఖాతా కూడా తెరువలేకపోయింది. అయితే.. ఢిల్లీలో విజయానికి ఎన్నోకారణాలున్నాయి. బీజేపీ ఆప్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేయడం వల్ల.. ఈ విజయం సాధ్యమైంది.
అయితే బీజేపీ రాష్ట్రాల్లో ముఖ్యంగా.. రాజస్థాన్‌లోనూ అదేవిధంగా గెలిచింది. 2023లో బీజేపీ నుంచి భజన్‌లాల్ శర్మ సీఎం అయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్ సాయ్ ఆధ్వర్యంలో 2023లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండు టర్మ్‌లుగా గెలుస్తూ వచ్చారు. రెండేళ్లలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లో ధామి ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగుతోంది. మహారాష్ట్రలో గతేడాది దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కొలువుదీరింది. పొత్తులోనే అయినా.. బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. ఇక మధ్య ప్రదేశ్‌లో వరుసగా బీజేపీనే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం మోహన్ యాదవ్ సీఎంగా ఉన్నారు. హర్యానాలో గతేడాది అనూహ్యంగా బీజేపీ ఘనవిజయం సాధించింది. సీఎంగా సైనీ.. మరో నెలలో ఏడాది పూర్తిచేసుకుంటారు. గోవాలో బీజేపీ సీఎం ప్రమోద్ సావంత్ అప్రతిహతంగా ముందుకెళ్తున్నారు. ఇక గుజరాత్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోదీ పగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచి బీజేపీ ఓటమి ఎరుగలేదు. ప్రస్తుతం భూపేంద్రపటేల్ సీఎంగా ఉన్నారు. అస్సాంలో హిమాంత బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్‌లో పెమాఖండు, మణిపూర్‌లో బీరేన్ సింగ్, త్రిపురలో మానిక్ సాహా బీజేపీ సీఎంలుగా కొనసాగుతున్నారు.
ఇక బీజేపీ మిత్రపక్షాలైనా ఎన్డీఏ పార్టీలు కూడా పలు రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. వాటిలో ఏపీ కూడా ఒకటి… గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా చంద్రబాబు మరో నాలుగు నెలల్లో ఏడాది పూర్తి చేసుకుంటారు. ఇక బీహార్‌లో నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలో ముఖ్యమైన భాగస్వామి. ఆయన జేడీయూ చీఫ్‌గా.. బిహార్ సీఎంగా రెండు దశాబ్దాలుగా పలుమార్లు గెలిచారు. నార్త్‌ఈస్ట్‌లో మిజోరం తప్ప అన్ని బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాలే. పుదుచ్చేరి కూడా ఎన్డీఏ ఖాతాలో ఉంది. అయితే దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాల్లో NDA యేతర పార్టీలే పాలిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..