Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా సన్నద్ధమైంది. ఫిబ్రవరి 22న లాహోర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, ఆస్ట్రేలియా జట్టు రెండు టెస్టులు, రెండు వన్డేల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. దీని కారణంగా ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ పర్యటనలో గాయపడిన పాట్ కమిన్స్ స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్ కూడా గాయపడ్డాడు.
చీలమండ గాయంతో బాధపడుతున్న కమిన్స్ స్థానంలో శ్రీలంక పర్యటనలో స్మిత్ జట్టుకు నాయకత్వం వహించాడు. జనవరి 29 నుంచి శ్రీలంకతో ఆస్ట్రేలియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. అయితే, అంతకు ముందు స్మిత్ గాయపడ్డాడు. బిగ్ బాష్ లీగ్ సందర్భంగా స్మిత్ మోచేయికి గాయం కావడంతో శ్రీలంకతో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.
స్మిత్‌కు మోచేతి సమస్య కారణంగా ఇబ్బంది పడినట్లు హిస్టరీ ఉందనే సంగతి తెలిసిందే. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని కుడి చేతికి తగిలింది. 2019 సంవత్సరంలో, గాయం కారణంగా అతనికి శస్త్రచికిత్స జరిగింది. ఈ గాయం కారణంగా, దుబాయ్‌లోని జట్టు శిక్షణా శిబిరానికి స్మిత్ వెళ్లడం వాయిదా పడింది. ఎందుకంటే, అతను నిపుణుల నుంచి తదుపరి సలహా తీసుకోనున్నాడు. అతను ఈ వారంలోనే బయలుదేరే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది.
ట్రావిస్ హెడ్ కెప్టెన్ కావొచ్చు..
ఒకవేళ గాయం కారణంగా స్మిత్ శ్రీలంకతో టెస్టు ఆడలేకపోతే.. ట్రావిస్ హెడ్‌కి తొలిసారి టెస్టు కెప్టెన్‌గా మార్గం తెరుచుకుంటుంది. ఈ టూర్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ ఆడగలడని ఆస్ట్రేలియా భావిస్తోంది. అయితే, అతను గత వారం కుడి బొటనవేలులో ఫ్రాక్చర్‌తో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య జనవరి 29 నుంచి గాలెలో తొలి టెస్టు, ఫిబ్రవరి 6 నుంచి రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత రెండు వన్డే మ్యాచ్‌లు ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలంబోలో జరగనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..