మొన్న ఎన్నికలు ముగిసాయ్…! రేపు ఫలితాలు కూడా రాబోతున్నాయ్…! ఈ చిన్న గ్యాప్‌లోనూ ఢిల్లీ దద్దరిల్లుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తీవ్ర ఆరోపణలకూ దిగుతున్నారు. ఇక తాజాగా ఢిల్లీలో నడుస్తున్న హైడ్రామా… ఫలితాలపై ఇంకాస్త ఆసక్తిని పెంచాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ముందు శుక్రవారం హైడ్రామా కొనసాగుతోంది. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందనే ఆప్ ఆరోపణలు కాకరేపాయి. 16 మంది ఆప్ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు.. బీజేపీ ఆఫర్ చేసిందని.. ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలువురు నేతలు ఆరోపించారు. దాంతో.. నిగ్గుదేల్చాలని బీజేపీ డిమాండ్ చేయడం మరింత హీట్ పెంచింది. భారతీయ జనతా పార్టీ (BJP) పై మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించారు..
అసలేం జరిగిందంటే..
అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలువురు నేతలు.. గురువారం మాట్లాడుతూ.. తమ MLA అభ్యర్థులను బీజేపీ కొనేందుకు యత్నించినట్టు ఆరోపణలు గుప్పించారు. ఆపరేషన్ లోటస్ ప్రారంభించారంటూ విమర్శించారు. ఇప్పటిదాకా 16 మందికిపైగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు లెక్కతో సహా చెబుతున్నారు ఎంపీ సంజయ్ సింగ్. ఒక్కొక్కరికి 15 కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ ఫిర్యాదుతో ఆప్ బేరసారాల ఆరోపణలపై ACB దర్యాప్తునకు ఆదేశించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా.. ఆ వెంటనే.. ఏసీబీ అధికారుల బృందం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లింది. అంతకు ముందే ఆప్ అభ్యర్థులు అంతా అక్కడకు చేరుకోగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దర్యాప్తునకు హాజరుకావాలని ఏసీబీ బృందం నోటీసులు సైతం ఇచ్చింది.
ఇక.. కేజ్రీవాల్ ఇంట్లో ఏసీబీ దర్యాప్తుపై ఆప్ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఏసీబీ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కేజ్రీవాల్ తరపు న్యాయవాది రిషికేష్‌కుమార్. ఏ రూల్ ప్రకారం కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు వచ్చారని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఇంట్లోకి ఏసీబీ రావడం చట్టవిరుద్ధం అన్నారు. దర్యాప్తు సంస్థలను కొందరు కామెడీగా మార్చేస్తున్నారని ఆరోపించారు కేజ్రీవాల్ తరపు న్యాయవాది రిషికేష్‌కుమార్.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు ఆమ్‌ఆద్మీ ఎంపీ సంజయ్‌సింగ్. ఇప్పటివరకు 16 మందికి పైగా ఆప్ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్లు వచ్చాయన్నారు. బీజేపీ కొనుగోలు వ్యవహారంపై ACB చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంజయ్‌సింగ్.
కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.. ఫలితాలకు కొన్ని గంటల ముందు.. రాజకీయం మరింత హీటెక్కింది..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..