జనవరి 20.. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కుర్చీనెక్కిన రోజు. వైట్‌హౌస్‌లో రెండోసారి ఎంట్రీ ఇచ్చి రెండున్నరవారాలైనా కాలేదు. క్లైమేట్ ఛేంజ్ నుంచి చమురు తవ్వకాలు, మెడికల్ రిసెర్చ్, ఎల్‌జీబీటీక్యూ.. ఇవాళ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్‌పై ఆంక్షల దాకా.. ఆయన సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు రచ్చ లేపుతున్నాయి. దాదాపు అన్నీ సెక్టార్స్‌నీ కెలికేశాడు. కానీ.. అన్నిటి కంటే తీవ్రంగా ప్రభావితమైన సెక్షన్ మాత్రం ఒక్కటుంది. దాని గురించే ప్రపంచమంతా ఇప్పుడు గుండెలు బాదుకుంటోంది.
అధ్యక్షుడిగా తొలి ప్రసంగంలోనే తానేం చేయబోతున్నాడో క్లారిటీ ఇచ్చేశారు ట్రంప్. అమెరికాలో స్వర్ణ యుగం మొదలైందని.. వలసలు, సరిహద్దు భద్రత, పౌరసత్వమే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పినప్పుడే అక్కడుండే లక్షలాది ప్రవాసులకు ఎడమ కన్ను అదిరింది. మైగ్రేషన్ పాలసీని సమూలంగా మార్చిపారేసి.. ఇల్లీగల్ మైగ్రేంట్స్ మీద పగపట్టాడు మన డొనాల్డన్న. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్ మైగ్రేంట్లే ట్రంప్ మేస్టారికి ఫస్ట్ టార్గెట్టయ్యారు.
అక్రమంగా మా దేశంలో ఉంటున్న మీవాళ్ల సంఖ్య 7 లక్షల 25 వేలు. వీళ్లలో 18 వేల మందిని రౌండప్ చేశాం.. 205 మంది పేర్ల మీద అండర్‌లైన్ చేసుకున్నాం.. మీ దేశానికి పంపించేస్తున్నాం.. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్.. అని చాటింపు వేసిమరీ పంపించేసింది అమెరికాలో కొత్త గవర్నమెంట్. ఒక్కొక్కరి మీద 4 లక్షలు ఖర్చు పెట్టి.. మిలిటరీ విమానమెక్కించి.. టెక్సస్ నుంచి అమృత్‌సర్‌కి డిపోర్ట్ చేసింది అమెరికా. దీన్ని బట్టే అర్థమౌతోంది.. మనోళ్ల మీద ట్రంపు సారు ఎంత సీరియస్‌గా ఉన్నారో.
అక్రమంగా ఉంటున్నారని కరెక్టయిన డాక్యుమెంట్లు చూపిస్తే.. వాళ్లందరినీ స్వీకరించడానికి సిద్ధం అంటూ గతంలో మన ఎక్స్‌టర్నల్ ఎఫయిర్స్ మినిస్టరే అమెరికాకు రాసిచ్చారు. అందుకే.. మా తప్పేం లేదు.. మామీద పడి ఏడవకండి అంటూ.. మిగతా ఏడు లక్షలమంది ఇల్లీగల్ మైగ్రేంట్స్ మీద కూడా నజర్ పెట్టింది. ఐనా ఇంతమంది అక్కడికి ఏ దారుల్లో వెళ్లారు.. ఇన్నాళ్లూ ఎందుకున్నారు.. ఏం చేస్తున్నారు.. అనే చర్చ అటుంచితే.. అనుకోకుండా అవమానకర రీతిలో అమెరికా నుంచి తిరిగొస్తున్న ఈ విధివంచితులది ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ.
ఐటీ బూమ్ మొదలైన కొత్తరోజుల్లో మన ఇండియన్ కుర్రకారుకు డాలర్స్ డ్రీమ్స్ ఒక వేలంవెర్రి. ఎలాగైనా అమెరికాకు వెళ్లాలి.. కోటీశ్వరులు కావాలి.. అనే బంగారు కలలతో ఏటా లక్షలాది మంది అమెరికా వైపే ఆశగా చూసేవారు. ఇలా అమెరికా ఫ్లైటెక్కినవాళ్లల్లో స్టూడెంట్సే ఎక్కువ. అమెరికాలోని ఏదో ఒక యూనివర్సిటీలో సీటు పట్టి.. అక్కడకు వెళ్లి స్టోర్లు, రెస్టారెంట్స్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ స్టూడెంట్ లోన్ తీర్చుకుంటూ.. కొద్దొగొప్పో పాకెట్ మనీ మిగుల్చుకుంటూ బండిని లాక్కొచ్చే జిందగీలు అనేకం. ఇప్పుడు ట్రంప్ రాకతో ఏరివేత షురూ ఐంది. ఎక్కడ దొరికిపోతామో అనే భయంతో జాబులు వదిలేసి.. క్యాంపస్‌లో తలదాచుకుంటున్నారు.
నెలవారీ మెయింటెనెన్స్ కోసం ఎంతలేదన్నా ఐదొందలు డాలర్లయినా కావాలి. గతంలో ఖర్చులు పోనూ మిగుల్చుకున్న డాలర్లు రోజురోజుకూ కరిగిపోతున్నాయి. ఇక అమ్మానాన్నలే వీళ్లకు దిక్కూమొక్కు. మరి.. పేరెంట్స్‌కి గుండెల్లో రాయి పడ్డట్టే.
ముఖ్యంగా వీళ్ల మీదే ట్రంప్ ఎందుకు పగబట్టాడు.. అంటే ప్రత్యేకమైన కారణం ఉంది. అమెరికాలో నోస్కిల్ ఇండస్ట్రీ.. ప్రత్యేకించి బ్రెయిన్‌వర్క్‌తో ప్రమేయం లేని అసంఘటిత ఉద్యోగాల్లో ఎక్కువగా మనోళ్లే తిష్టవేశారు. ఈవిధంగా తమవాళ్లకు రావల్సిన రెవెన్యూను లాగేసుకుంటున్నారని, అమెరికన్ ఎకానమీకి గండి కొడుతున్నారని ట్రంపువారికి కన్ను కుట్టింది. అసలే అమెరికా ఫస్ట్ అంటూ లోకల్ సెంటిమెంట్‌ను ఎగదోస్తున్న ట్రంప్.. ఫస్ట్ ఎటాక్ ఈ చిన్న చేపల మీదే చేశారు. ఏదో ఒక పని చేసుకుని.. పొట్టపోసుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ మీద పగపట్టేశాడు.
అప్పోసొప్పో చేసి పిల్లల్ని అమెరికా పంపించిన తల్లిదండ్రులు.. ఇప్పుడు అక్కడున్న తమ పిల్లలకు తిండీగూడూ గుడ్డ కూడా తమ ఖర్చులతోనే ఏర్పాటు చెయ్యాల్సిన దీనావస్థ. ఇక్కడితోనే ఆగలేదు మనోళ్ల మీద ట్రంపరితనం. తమ దేశంలో పుట్టిన విదేశీయులకు ఆల్రెడీ బర్త్‌రైట్ రద్దు చేశారు. అటు.. గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌లో ఉన్నవారికీ ట్రంప్ తీసుకురాబోయే కొత్త రూల్స్ తలనొప్పిగా మారబోతున్నాయి. ఇమ్మిగ్రేషన్ పాలసీ సంస్కరణ కోసం చేసిన సిఫార్సులు అమెరికన్ కాంగ్రెస్‌లో పాసైతే .. ఇండియా నుంచి వచ్చేవాళ్లకు సినిమా కష్టాలు తప్పవన్నమాటే.
- మొదటిది.. హెచ్1బీ వీసాల పితలాటకం. H1Bల సంఖ్యను ఇప్పటికే 75వేలకే పరిమితం చేశారు. అవి కూడా లాటరీ పద్ధతిలోనే ఇస్తారు. రెండుమూడు కన్సల్టెన్సీల్ని పట్టుకుని ఎలాగోలా వీసాలు తెచ్చుకోవాలనే ఆదుర్దానే అందరిలోనూ.
- ఇక.. డిపెండెంట్ వీసాలపై ఆంక్షలు. ఇప్పటిదాకా హెచ్4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకోవచ్చనే వెసులుబాటుంది. ఆ రిలీఫ్‌కు ఇక మీదట నో చెప్పబోతోంది ట్రంప్ సర్కార్.
- గ్రీన్‌కార్డ్ ప్రాసెస్‌లో కీలకమైన ఐ-140 దశలో.. హెచ్1బీ ఎక్స్‌టెన్షన్ ఆటోమేటిక్‌గానే ఉండేది. ఇకమీదట అది రద్దవుతుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రీన్ కార్డు రావడమే గగనం. గతంలో ఎనిమిదేళ్లలో వచ్చేసే సిటిజన్‌షిప్ కోసం ఇప్పుడు జీవితకాలం ఎదురుచూడక తప్పదా..?
సో.. నో మోర్ డాలర్ డ్రీమ్స్ ఫర్ అవర్ కిడ్స్. నిన్నటిదాకా మావాడు అమెరికా అని చెప్పుకోవడం స్టేటస్ సింబల్. ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతోంది. బంగారు కలలు బండబారిపోతున్నాయి.
యూఎస్‌లో స్టూడెంట్ ప్రాణం తీసిన డిపోర్టేషన్ టెన్షన్..
ఫెడరల్ అధికారులు పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకోవడంతో న్యూయార్క్‌లో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నది బ్రేకింగ్ న్యూస్. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన అతడు పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారట. అరెస్టు చేస్తారని, బేడీలేసి వెనక్కి పంపుతారని భయపడి పనిచేస్తున్నచోటే ప్రాణం తీసుకున్నాడట. డాలర్ డ్రీమ్స్ శకంలో ఇటువంటి కడు విషాదాల్ని చవిచూస్తామని కలలోనైనా ఊహించామా..?
డిపోర్టేషన్ టెర్రర్.. ఇండియాకూ కొత్త కాదు.. అమెరికాకూ కొత్త కాదు. 2009 నుంచి పదిహేనేళ్లలో మొత్తం 15 వేల 756 మందిని అమెరికన్ గవర్నమెంట్ జల్లెడపట్టి.. లెక్కతేల్చి.. ఇండియాలో దిగబెట్టింది. ఈ విషయాన్ని విదేశాంగమంత్రి జైశంకర్ గారే రాజ్యసభలో సెలవిచ్చారు. సో.. ఉంటున్నదే అక్రమంగా కనుక.. వెనక్కిపంపడం తప్పు కాదు.. పంపిన విధానమే తప్పు.. దాని గురించి అమెరికాతో మాట్లాడతాం అనేది మన ప్రభుత్వ స్పందన.. దీనిపై జాతీయ రాజకీయాలు సైతం వేడెక్కాయి..
అడ్డదారిలో అమెరికా వెళ్లడాన్ని డంకీ రూట్ అని ముద్దుగా పిల్చుకుంటారు. వీళ్లంతా నేరుగా అమెరికా వెళ్లరు. అమెరికా పొరుగునే ఉండే ఈక్విడార్ లాంటి వీసాఫ్రెండ్లీ దేశాలకు వెళ్లి.. అక్కడినుంచి నకిలీ ఏజెంట్లు.. ఫేక్ డాక్యుమెంట్ల సాయంతో అమెరికా గడ్డమీద అడుగు పెడతారు. ఇంత రిస్కూ తీసుకుని.. ఎందుకెళతారు అంటే డబ్బు సంపాదనతో పాటు చాలా కారణాలుంటాయి. ఐతేమాత్రం ఖూనీకోరుల్లా ట్రీట్ చేస్తారా.. బేడీలేసి పంపిస్తారా.. అనేది ఒక అభ్యంతరం.
యుద్ధఖైదీలను, అజ్మల్ కసబ్ లాంటి కర్కోటకుల్ని కూడా గౌరవప్రదంగా చూసిన చరిత్రుంది మనకు. కానీ.. అక్రమంగా వలస వచ్చారన్న కారణంతో మహిళలు, చిన్న పిల్లలకు సైతం కాళ్లకు చైన్లు కట్టి, చేతులకు బేడీలు వేసి.. తీసుకురావడమే గుండెలు తరుక్కుపోయే విషయం.
రెండో విడతలో మరో 487 మంది ఇండియన్స్‌ని డిపోర్ట్ చేయబోతోంది అమెరికా. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌పై ఇప్పటికే మన ప్రభుత్వంతో మాట్లాడుకుంది కూడా. ఈసారైనా మావోళ్లను గౌరవంగా పంపండి అన్న రిక్వెస్టును కూడా ఓకే చేసింది. మనవాళ్లే కాదు.. చైనా, బ్రెజిల్, పనామా.. అన్ని దేశాల వాళ్లూ డిపోర్టేషన్ బాధితులే. సరే.. వక్రమార్గంలో వెళ్లే విదేశీయులు, వాళ్లకిచ్చే ట్రీట్‌మెంటూ కాసేపు పక్కకు బెడదాం. బతుకుదెరువు కోసం పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తూ దొరికిపోయే వాళ్లవే అంతులేని దుఃఖాలు.
డిపోర్టేషన్ కోసం ఇమ్మిగ్రేషన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థనే ఏర్పాటు చేసింది. ఇదిగో వీళ్లే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ స్థానికులే టిప్స్ ఇవ్వడం.. ICE అధికారులొచ్చి తనిఖీలు చేసి, వివరాలు తీసుకుని ఎప్పటికప్పుడు వైట్‌హౌస్‌కు అందజేస్తోంది. ఇలా.. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న అక్రమవలసదారుల వేటలో 6వేల మంది ICE అధికారులు పాల్గొంటున్నారు. ఇప్పటికే ICE కస్టడీలో 42వేల మంది అక్రమ వలసదారులున్నారు. ముఖ్యంగా సరైన స్క్రూటినీ లేకుండా.. ఆషామాషీగా అడ్మిషన్లు జరిగిన యూనివర్సిటీల మీదే నిఘా పెరిగిందట.
ఇప్పటికిప్పుడు యూనివర్సిటీలు మారలేక.. ఉన్నచోటే చదవలేక.. చదువుతూ పార్ట్‌టైమ్ జాబ్స్ చెయ్యలేక బిక్కచచ్చిపోతున్నారు ఇండియన్ స్టూడెంట్స్. అమెరికాలో పరిస్థితి అంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఆ తాకిడి కన్సల్టెన్సీలకు, ట్రావెల్ ఏజెన్సీలకు తాకినట్టు లేదు. అమెరికన్ కాన్సులేట్లు గానీ, ఇండియన్ గవర్నమెంట్ గానీ ఇప్పటికీ క్షేత్రస్ఖాయిలో అలర్ట్ నోటీసులు ఇచ్చిన దాఖలాలైతే లేవు.
అమెరికాలో ఎమ్‌ఎస్ ఐపోగానే అక్కడే జాబ్స్ దొరుకుతాయన్న ఆశలు ఒకప్పటివి. ఇప్పుడైతే అంత సినిమా లేదు. దానికి తోడు వీసా రూల్స్ మార్చడం.. కొత్తగా డిపోర్టేషన్ భయం. పైగా.. అమెరికా పొమ్మంటోంది.. మన ప్రభుత్వం కూడా డోర్లు తెరిచేసింది. మొత్తంగా అమెరికా అనగానే అమ్మో అనే నేచర్ పెరిగి.. రాబోయే రోజుల్లో అమెరికా గోయర్స్ సంఖ్య భారీగా తగ్గినా తగ్గొచ్చు. దాంతో మన దేశంపై పడే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా డేంజర్.
స్వార్థం కోసం కొందరు చేసే తొందరపాటు చర్యలు.. వాళ్ల జీవితాల్నే కాదు.. రెండు దేశాల మధ్య దూరాన్ని కూడా పెంచుతున్నాయి. అమెరికాతో మనకున్న ఫ్రెండ్లీ నేచర్ కూడా చెడిపోతోంది.
ఎవరైనా యూఎస్‌లో సెటిలైతే ఇండియాలో కొన్ని జెనరేషన్లు మెరుగౌతాయి. అమెరికన్ డాలర్లు రూపాయిలుగా మారి మన ఎకానమీనీ బలపరుస్తాయి. ట్రంప్ ఎత్తుకున్న ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో మొదటగా నష్టపోయేది ఇండియానే అని మొదట్లో వాణిజ్య వర్గాలే అంచనా వేశాయి. కానీ.. ట్రంప్ చేష్టలతో మనకు అంతకుమించిన డ్యామేజ్ తప్పదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇదే గ్యాప్‌లో ఫారిన్ టూరేస్తున్నారు ప్రధాని మోదీ. 12వ తేదీ అమెరికా వెళతారు. అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అవుతారు. సయోధ్య లాంటిదేదైనా జరిగి.. అమెరికాలో మనోళ్లకు ఏదైనా భరోసా దొరుకుతుందా.. చూడాలి మరి..
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..