గన్ కల్చర్‌కు పెట్టింది పేరు అమెరికా. మాస్ ఫైరింగ్ జరిగినప్పుడల్లా గన్ కల్చర్‌పై తీవ్ర చర్చలు నడిచినా.. ఆ తర్వాత అగ్రరాజ్యం అంతా సైలెంట్ అవుతుంది. అడపాదడపా జరిగే కాల్పుల్లో మాత్రం ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వారు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో ఏడాదిలో తెలుగువారే నలుగురికి పైగా చనిపోయారు. తాజాగా హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చైతన్యపురి ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రవితేజ చనిపోయాడు. 2022 మార్చిలో రవితేజ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్ ఏస్‌లో గత రాత్రి ఒక్కసారిగా యువకుడిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన రవితేజ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.
గతేడాది నవంబర్ 29న ఖమ్మంకి చెందిన సాయితేజ చికాగోలో దారుణ హత్యకు గురయ్యాడు. MS చదువుతూ షాపింగ్ మాల్‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో సాయితేజపై కాల్పులు జరిపారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. దాంతో.. స్పాట్‌లోనే సాయితేజ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని అట్లాంటాలో ప్రవాస భారతీయ ప్రొఫెసర్, వ్యాపారవేత్త అయిన శ్రీరాం సింగ్ 2024 నవంబర్ 22న హత్యకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. యూపీ తుల్సీపుర్ గ్రామానికి చెందిన ఆయన దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఏరుగొండ రాజేష్ 2024 ఆగస్టు 16న అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మిసిసిపి రాష్ట్రంలోని డీన్ మెమోరియల్ ప్యునరల్ హోమ్‌లో ఉంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న రాజేష్ హత్యకు గురయ్యాడని అనుమానించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అభిజిత్ కూడా గతేడాది మార్చిలో అమెరికాలో హత్యకు గురయ్యాడు. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన అభిజిత్.. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతుండగా.. అదే వర్సిటీ ప్రాంగణంలో గుర్తుతెలియని దుండగులు చేతిలో హత్యకు గురయ్యాడు. మనోళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రపంచ దేశాలకు చెందిన వారి పరిస్థితి ఏంటి?. ట్రంప్ వచ్చాకైనా.. ఈ పరిస్థితి మారుతుందా?. ఇండియన్స్ విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి