అక్రమ వలసలతో సతమతమవుతున్న అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే ఓ భారీ ఆపరేషన్ చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడి నివసిస్తున్నవారందరినీ తరిమేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైతే మిలటరీని రంగంలోకి దించుతామని కూడా చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమ వలసలే అత్యంత కీలకాంశంగా మారిన విషయం తెలిసిందే. తన విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ అంశంపైనే తొలి సంతకం అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు.
అక్రమ వలసలపై నేషనల్ ఎమర్జెన్సీ
దేశ భద్రతకు పెనుముప్పు తలెత్తినప్పుడో, యుద్ధం సమయంలోనో నేషనల్ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించడం పరిపాటి. అయితే అగ్రరాజ్యం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (USA)లో పరోక్షంగా అక్రమ వలసలపై నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తామని ట్రంప్ క్యాంప్ చెబుతోంది. బోర్డర్ సెక్యూరిటీ (సరిహద్దు భద్రత) వైఫల్యం కారణంగానే అక్రమ వలసలకు ఆస్కారం కల్గింది కాబట్టి.. ఈ అంశంపైనే ఎమర్జెన్సీ విధించేందుకు సిద్ధమైనట్టు ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తిష్టవేసిన అక్రమ వలసదారులను గుర్తించి, వారిని స్వదేశాలకు పంపించే భారీ ఆపరేషన్ చేపట్టనున్నారు. అలాగే అక్రమ వలసలకు ఆస్కారం కల్పిస్తున్న సరిహద్దులను పటిష్టం చేయనున్నారు.
అధికారవర్గాల అంచనాల ప్రకారం దేశంలో 1.1 కోట్ల మంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారు. ట్రంప్ నిర్ణయం కారణంగా దాదాపు 2 కోట్ల కుటుంబాలు ప్రభావితమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ అక్రమ వలసల్లో అత్యధికంగా ఆ దేశానికి దక్షిణాన ఉన్న మెక్సికో సరిహద్దు నుంచే జరిగాయి. వస్తు రవాణాకు ఉపయోగించే కంటైనర్లలో దాక్కుని వస్తున్న అక్రమవలసదారులు ఊపిరాడక చనిపోయిన ఉదంతాలు సైతం ఈ బోర్డర్‌లోనే చోటుచేసుకున్నాయి. అత్యధికంగా 2023 డిసెంబర్ నెలలో 2.5 లక్షల మంది మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో చొరబడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అంశాలనే ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. అక్రమ ‘చొరబాట్ల’ను ట్రంప్ దండయాత్రగా అభివర్ణించారు. అలా చొరబడినవారు అమెరికన్లపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ చొరబాటుదారులు అమెరికా రక్తాన్ని విషతుల్యం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వస్తే వారందరినీ ఎలా వెనక్కి పంపిస్తానన్నది వివరంగా చెప్పకపోయినా.. 1798నాటి “ఏలియన్ ఎనిమీస్ యాక్ట్” అమలు చేసి అక్రమంగా వలసవచ్చినవారిని వెనక్కి పంపిస్తామని చెప్పారు. అయితే విమర్శకులు మాత్రం ఇది చాలా పాత చట్టమని, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాలో నివసిస్తున్న జపానీయులను గుర్తించి క్యాంపుల్లో పెట్టడం కోసం ఉపయోగించారని చెబుతున్నారు.
అమెరికన్లలో అక్రమ చొరబాట్లపై అసహనం
అమెరికా అంటేనే వలసలతో ఏర్పడ్డ దేశం. నేటివ్ అమెరికన్లు (రెడ్ ఇండియన్లు) కంటే బ్రిటన్ సహా ఆసియా దేశాల నుంచి వలస వచ్చి స్థిరనివాసం ఏర్పర్చుకున్నవారి సంఖ్యే ఆ దేశంలో ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నైపుణ్యం కల్గిన మేధావులు అమెరికాకు వలసవచ్చి ఆ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా తీర్చిదిద్దారని ఆ దేశాధినేతలు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. మన దేశం నుంచి కూడా ప్రతిరోజూ వేలాది మంది అమెరికన్ వీసా కోసం క్యూ కడుతూ ఉంటారు. అన్ని పత్రాలు సరిగా ఉన్నా సరే అందరికీ వీసా దొరకదు. అలాంటి దేశం గత కొన్నేళ్లుగా అక్రమ వలసలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సక్రమ మార్గంలో ఆ దేశానికి చేరుకుంటున్న భారతీయ ఇంజనీర్లు అక్కడి ఉన్నత ఉద్యోగాలను కైవసం చేసుకుంటూ ఉంటే.. కింది స్థాయి ఉద్యోగాలన్నీ అక్రమ చొరబాటుదారులు కైవసం చేసుకుంటున్నారు. దీంతో స్థానిక అమెరికన్ యువత నిరుద్యోగులుగా మారుతున్నారు. పైపెచ్చు అక్రమంగా వచ్చేవారిలో నేరస్థులు, నేర ప్రవృత్తికల్గినవారు ఎక్కువగా ఉంటున్నారు. తద్వారా నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ స్థానిక అమెరికన్లలో అసహనానికి కారణమయ్యాయి. డెమోక్రాట్లు తమ ఉదారవాద సిద్ధాంతాల కారణంగా అక్రమ చొరబాట్లపై చర్యలు తీసుకోలేదు. అందుకే ఓటర్లు ఎన్ని అవలక్షణాలున్నా సరే డోనాల్డ్ ట్రంప్‌ను భారీ మెజారిటీతో గెలిపించారు. అందుకే ట్రంప్ అక్రమ చొరబాట్లపై యుద్ధాన్ని ప్రకటించారు.