చేపలు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చికెన్, మటన్ కంటే చేపలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చిన్నారుల్లో ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. దీర్ఘకాలంలో వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంచడంలో చేపలు ఉపయోగపడతాయి.
అయితే మనలో చాలా మంది చేపల్లో తలకాయను పడేస్తుంటారు. తలకాయను తినడానికి ఇష్టపడరు. అసలు ఇంట్లోకి కూడా తలకాయను తీసుకురారు. చేపలను కొనుగోలు చేసిన దగ్గరే వదిలేసి వస్తుంటారు. అయితే చేప తలకాయతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చేప తలకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ఇంతకీ చేప తలకాయతో కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చేప తలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలతోని ఇతర భాగాలతో పోల్చితే తలకాయలో ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చేప తలలో తగినంత ప్రోటీన్ కూడా ఉంటుంది. అందుకే ప్రోటీన్ లోపాన్ని జయించాలంటే కచ్చితంగా చేప తలకాయ తీసుకోవాలని సూచిస్తున్నారు. కండరాల నిర్మాణంతో పాటు, సెల్ పనితీరును మెరుగుపరచడంలో కూడా చేప తలకాయ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా చేప తలకాయ బాగా పనిచేస్తుంది. ఇందులోని సంతృప్త కొవ్వు శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకోవడంలో ఉపయోగపడుతుంది. దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మెరుగైన కంటి చూపు కోసం కూడా చేప తలకాయ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెటీనా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక చేప తలో ఉండే పోషకాలు మధుమేహం, ఆర్థరైటిస్ రోగులకు కూడా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..