అమెరికా టూ అనకాపల్లి. ఎక్కడచూసినా ఇదే సీన్. బంగారం ధర నేలచూపులు చూస్తోంది. గత నెల చివరి వరకు రేసు గుర్రంలా పరుగెత్తిన గోల్డ్ రేట్.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో వరుసగా తగ్గుముఖం పడుతోంది. దీపావళి తర్వాత బంగారం ధర వరసగా తగ్గుతూ వస్తోంది.
హైదరాబాద్ మార్కెట్లో గత నెల 30న 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం రికార్డు స్థాయిలో 81వేల 800 పలికింది. దాంతో.. డిసెంబర్, న్యూఇయర్ నాటికి 10 గ్రాముల గోల్డ్ రేట్ లక్షకు చేరుతుందనే అంచనాలు వినిపించాయి. కానీ.. అమెరికా ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. రెండు వారాల క్రితం 81వేల 800 పలికిన 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర.. 75వేల 650కు దిగొచ్చింది.
మనదేశంలో బంగారం ధరలకు ప్రామాణికం- MCX. అంటే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్. అక్టోబర్ 30నాడు MCXలో 10 గ్రాముల బంగారం ధర 79,535 రూపాయలు పలికింది. అక్కడినుంచి బంగారం దిగుతూ వచ్చి 73,612 రూపాయలకు చేరింది. అంటే 6,150 రూపాయలు తగ్గిందన్నమాట. ఇదంతా కేవలం 17 రోజుల్లోనే జరిగిపోయింది. ట్రంప్ అధికారంలోకి రావడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించడం, డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం అన్నీ కలసి బంగారం ధరలను తగ్గించాయి.
ఇక.. 22 క్యారెట్స్ బంగారం ధర కూడా భారీగా తగ్గింది. మొన్నటివరకు 75 వేల వరకు ఉన్న పది గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర.. ఇప్పుడు 70 వేల దిగువకు పడిపోయింది. ఈ లెక్కన 22 క్యారెట్స్ బంగారం ధర రెండు వారాల్లో దాదాపు 5వేల రూపాయలకు పైగానే తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 69వేల 350 రూపాయలుగా ఉంది.
గత నెలలో కిలో వెండి ఏకంగా లక్షా 12వేలకు చేరింది. కానీ.. కొద్దిరోజులుగా వెండి కూడా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి ధర కిలో 99 వేలు ఉంది. గత నెలతో పోల్చితే కిలో వెండిపై 13 వేల రూపాయల వరకు ధర తగ్గింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..