గర్భం దాల్చిన వెంటనే ప్రతీ మహిళలకు వచ్చే అనుమానం ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఏది తింటే మంచిది.? ఏది తింటే ఏమవుతుంది.? లాంటి విషయాల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటి వాటిలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే కనిపించి డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా దర్శనమిస్తున్నాయి. ఇంతకీ గర్భిణీలు డ్రాగన్ ఫ్రూట్‌ను తీసుకోవచ్చా.? తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
డ్రాగన్ ఫ్రూట్ గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటి యాక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ తొలుగుతాయి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీల్లో నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడంతో విటమిన్ బీ12 లోపం రాదు.
ప్రెగెన్సీ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా.. డయాబెటిస్ వచ్చే అవకావాలు ఎక్కువగా ఉంటాయి. అయితే డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇక గర్భిణీల్లో మల బద్ధకం సమస్య రావడం కూడా సర్వసాధారణమే. అయితే డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ అజీర్తి, మలబద్ధకం సమస్యలు దరి చేరవని నిపుణులు చెబుతున్నారు.
ఎముకల ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా డ్రాగన్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పండు తీసుకోవడం వల్ల తల్లీ, బిడ్డల్లో ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా మారుతాయి. ఇందులోని కాల్షియం కంటెంట్ ఎముకలను బలోపేతం చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇది రక్త హీనతను దూరం చేస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..