మెట్లెక్కడం, దిగడం అనేది శారీరక ఆరోగ్యం కోసం చాలా ప్రయోజనాలు కలిగిన సహజమైన వ్యాయామం. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, డయాబెటిస్ ముప్పును తగ్గించడం, క్యాలరీలను వేగంగా బర్న్ చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించడం, కండరాల బలాన్ని పెంచడం వంటి ప్రయోజనాలు అందిస్తుంది. ఆరోగ్యకరమైన జీవాన విధానంలో దీన్ని అలవాటు చేసుకోండి. మెట్లను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం
మెట్లెక్కడం, దిగడం వల్ల గుండె స్పందన పెరుగుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని శరీరం మొత్తం సజావుగా గమనించడంలో సహాయపడుతుంది. దీని వల్ల ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజు 7 నిమిషాలపాటు మెట్లెక్కడం ద్వారా గుండెపోటు ముప్పు సగం వరకు తగ్గించవచ్చు.
డయాబెటిస్ ముప్పు
మెట్లెక్కడం, దిగడం రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది. ఇది డయాబెటిస్ ముప్పును కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
క్యాలరీల బర్న్
జాగింగ్‌తో పోల్చితే మెట్లెక్కడం అనేది చాలా వేగంగా క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఒక నిమిషం మెట్లెక్కితే సుమారు 5 నుంచి 11 క్యాలరీలు బర్న్ చేయవచ్చు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. లిఫ్ట్‌ను ఉపయోగించటం కన్నా మెట్లు ఎక్కడం వల్ల ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది.
మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది
మెట్లెక్కడం, దిగడం మానసిక ఒత్తిడిని తగ్గించే ఒక మంచి మార్గంగా ఉంటుంది. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా నిరుత్సాహంగా ఉంటే మెట్లు ఎక్కడం ద్వారా మంచి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. శరీరానికి ఉత్సాహాన్ని అందిస్తూ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కండరాల బలం
మెట్లెక్కడం వల్ల కాళ్లు, పొట్ట, వెన్ను, చేతుల్లోని కండరాలు బలపడతాయి. ఇది కీళ్ల కదలికను మెరుగుపరుస్తుంది. కీళ్లలోని దృఢత్వాన్ని పెంచి ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. బలమైన కండరాలు, కాఫ్ మసిల్స్‌ను పెంచుతుంది.
సహజమైన వ్యాయామం
మెట్లెక్కడం అనేది సహజమైన వ్యాయామ విధానం. ఇది రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఏ జిమ్ లేదా వ్యాయామ సామగ్రి అవసరం లేకుండా ఈ వ్యాయామాన్ని ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు.
ఎండార్ఫిన్ విడుదల
మెట్లెక్కడం సమయంలో శరీరం సహజసిద్ధంగా ఎండార్ఫిన్స్‌ను విడుదల చేస్తుంది. ఇది మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా మానసిక శాంతిని అందిస్తుంది. దీని ద్వారా ఆందోళన స్థాయిలు తగ్గుతాయి.
మెట్లెక్కడం ఎవరు చేయకూడదు
గుండె సమస్యలు ఉన్నవారు మెట్లెక్కడం వల్ల రక్తపోటులో మార్పులు వచ్చి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మోకాళ్ల లేదా కీళ్ల సమస్యలతో బాధపడుతున్నవారికి మంచిది కాదు. ఇది నొప్పిని మరింత పెంచుతుంది. అలాగే శ్వాస సమస్యలతో బాధపడుతున్నవారు మెట్లెక్కడం మంచిది కాదు. వయసు మీదపడిన వారు మెట్లెక్కడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మెట్లెక్కడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ, కేవలం కొన్ని జాగ్రత్తలతో చేయాల్సి ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)