పైకి కనిపించేదేమో ఐస్‌క్రీమ్ బిజినెస్.. కానీ, దాని వెనక సాగేది మాత్రం గంజాయి దందా. అవును, చల్లచల్లని ఐస్‌క్రీమ్ మాటున.. మత్తెక్కించే గంజాయి బిజినెస్ చేస్తున్నాడు ఓ యువకుడు. విశాఖ గాజువాకకు చెందిన రాజు.. ఐస్‌క్రీమ్ బిజినెస్ చేస్తూ గంజాయి పెడ్లర్ అవతారం ఎత్తాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆర్డర్స్ మీద గంజాయి సప్లై చేస్తూ.. ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. అయితే, హైదరాబాద్ పోలీసుల కళ్ల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒడిశా నుంచి మహారాష్ట్ర చంద్రాపూర్‌కు గంజాయి సప్లై చేస్తుండగా చాదర్‌ఘాట్‌లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు రాజు. బస్సు కోసం వేచిచూస్తున్న అతడిని అరెస్ట్ చేసి 62 కేజీల గంజాయిని సీజ్‌చేశారు.
అయితే, గంజాయి సప్లై చేస్తూ రాజు పట్టుబడటం ఇది మొదటిసారి కాదంటున్నారు పోలీసులు. గతంలో కూడా ఎన్నోసార్లు పట్టుబడి.. జైలుకెళ్లొచ్చినా రాజులో మాత్రం రాలేదంటున్నారు. గంజాయి పెడ్లర్ రాజుపై ఏపీ, తెలంగాణలోనూ కేసులు ఉన్నట్టు చెప్పారు.
హైదరాబాద్ మాదాపూర్‌లో మరో గాంజా ముఠా పట్టుబడింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే లక్ష్యంగా గంజాయి, హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. వాళ్ల నుంచి 830 గ్రాముల గంజాయి, 14 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్నే లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా గాంజా విక్రయాలు సాగిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. స్టూడెంట్స్‌కి కూడా గంజాయిని అలవాటుచేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..