హైటెక్స్ సిటీలో ఫారిన్ గంజాయి గుప్పుమన్నది. కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పెడ్లర్లుగా మారారు. తమకున్న సాఫ్ట్వేర్ తెలివితో ఏకంగా విదేశాలకు చెందిన గంజాయిని తీసుకువచ్చి తోటి ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. అయితే వారి ఆటకట్టించారు పోలీసులు.
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 170 గ్రాముల విదేశీ గంజాయి సీజ్ చేశారు పోలీసులు. అమెరికా నుంచి నగరానికి విదేశీ గంజాయి సరఫరా చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ శివరామ్‌ను అరెస్ట్ చేసింది తెలంగాణ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీమ్. ప్రైవేట్ బస్సులో నగరానికి గంజాయి తీసుకువచ్చాడు శివరామ్. గంజాయి సరఫరా చేస్తున్న మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అజయ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గంజాయి సరఫరా చేస్తోందీ ముఠా. యూఎస్ఏ కాలిఫోర్నియాలోని అరోమా ప్రాంతంలో ఓజీ కుష్ గంజాయిని రహస్యంగా పండిస్తున్నారు. దాన్ని అక్కడి నుంచి సీక్రెట్‌గా బెంగళూరుకి తెప్పించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ హై క్వాలిటీ గంజాయిలో.. మరింత మత్తుకు కారకమయ్యే టెట్రా హైడ్రో క్యాన్బినాన్ అనే పదర్థాన్ని కూడా మిక్స్ చేస్తున్నారట. మన దగ్గర దొరికే సాధారణ గంజాయిలో 2 నుంచి 4 శాతం THC ఉంటే.. వారు దిగుమతి చేసుకుంటున్న గంజాయిలో అది 25 శాతం ఉంటుంది. అందువల్ల ఈ గంజాయి తీసుకుని మబ్బుల్లో తేలిపోతుంటారు కొందరు యువకులు. అందుకే అధికర ధర చెల్లించి మరీ.. దాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ గంజాయిని ఒక గ్రాము రూ.3వేలకు ఉంటుందని తెలిసింది.
మత్తు పదార్థాలు, గంజాయి రవాణా చేయొద్దు, వినియోగించవద్దని పదే పదే చెప్తున్న పోలీసులు.. ఎక్కడికక్కడ దాడులు చేసి పట్టుకుంటున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐటీ కారిడార్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి వచ్చిన గంజాయిని పట్టుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..