భార్యను అతికిరాతకంగా చంపేశాడో భర్త. శవం ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. కథ స్క్రీన్ ప్లే పకడ్బందీగా అల్లేసి.. బంధువులందరి కళ్లుగప్పాడు. బట్.. మ్యాటర్ ఖాకీల చెవిన పడటంతో మర్డర్ వెనుక మిస్టరీ మొత్తం బయటపడింది. ఇంతకీ భార్యను చంపిన ఆ భర్త ఎవరు? ఎందుకు అంత దారుణంగా మట్టుబెట్టాడు?
అనుమానంతో చాలాసార్లు గొడవలు
ఈమె పేరు వెంకట మాధవి. భర్త గురుమూర్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లెలగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉండేది. గురుమూర్తి ప్రాపర్ ప్రకాశం జిల్లా జేపీ చెరువు. ప్రస్తుతం సిటీలోనే డీఆర్‌డీఓలో ఔట్‌సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. భార్య మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి చాలాసార్లు గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని పథకం వేసి సంక్రాంతికి పిల్లల్ని ఊరికి పంపించాడు. అదే సమయంలో అత్యంత దారుణంగా మాధవిని మట్టుబెట్టాడు.
ఈనెల 13న మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు
భార్యను చంపిన గురుమూర్తి.. ఆ తర్వాత తనకేం తెలియనట్టు వ్యవహరించాడు. ఎవరికీ అనుమానం రాకుండా అమాయక చక్రవర్తిలా నటించాడు. అయితే రోజులు గడిచినా మాధవి నుంచి ఎలాంటి ఫోన్‌కాల్ రాకపోవడంతో కన్నవాళ్లకు అనుమానం వచ్చింది. తమ బిడ్డ కనిపించడం లేదంటూ ఈనెల 13న మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన స్టయిల్‌లో విచారించారు. దీంతో తానే చంపినట్టు విచారణలో అంగీకరించాడు గురుమూర్తి.
జిల్లెలగూడ చెరువులో శరీర భాగాలు
మాధవిని చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడకపెట్టాడు గురుమూర్తి. ఆ తర్వాత వాటిని నగర శివారులోని జిల్లెలగూడ చెరువులో పడేశాడు. భార్యను చంపడానికి ముందు ట్రయల్ కోసం ఓ కుక్కను చంపి ముక్కలుగా నరికి ఉడకబెట్టాడు. ఇదే విషయాన్ని విచారణలో అంగీకరించాడన్నారు పోలీసులు.
అనుమానం మాత్రమేనా? ఇంకేవైనా కారణాలా?
గురుమూర్తి శాడిజం కన్నబిడ్డలతో పాటు బంధువుల్ని నివ్వెరపోయేలా చేసింది. కేవలం అనుమానంతోనే భార్యను కడతేర్చాడా? ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? మర్డర్ ఎపిసోడ్‌లో గురుమూర్తికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి