భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే మన ముందుకు రాబోతోంది. హైడ్రోజన్‌తో నడిచే రైలు ట్రయల్ డిసెంబర్ 2024లో జరగనుంది. ఈ రైలు డీజిల్ లేదా విద్యుత్‌తో కాకుండా హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించి నడుస్తుంది. 2030 నాటికి భారతదేశంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ హైడ్రోజన్ రైలును లాంచ్ చేశారు. శక్తిని ఉత్పత్తి చేయడానికి నీటిని ఉపయోగించే భారతదేశపు మొదటి రైలు ఇది. డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్లకు బదులుగా, ఈ రైలు హైడ్రోజన్ నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
ఇండియన్ రైల్వేస్ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు డీజిల్ ఇంజిన్‌ల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని తొలగించడం కోసం హైడ్రోజన్ రైలును లాంచ్ చేస్తుంది. హైడ్రోజన్‌ని ఉపయోగించడం ద్వారా ఈ రైలు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మొదలైన కాలుష్యాన్ని విడుదల చేయదు. ఈ రైళ్లు డీజిల్ ఇంజిన్‌ల కంటే 60 శాతం తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 35 హైడ్రోజన్ రైళ్లను లాంచ్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంది.
హైడ్రోజన్ రైలుకు సంబంధించిన మొదటి ట్రయల్ రన్ హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో ఉంటుంది. ఇది దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది కాకుండా, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వే వంటి వారసత్వ పర్వత రైలు మార్గాలు కూడా ఉన్నాయి. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లు ఉంటుంది. అందువల్ల ప్రయాణికులు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించగలరని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి ఇంధనం నింపితే రైలు 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ రైలుకు ప్రతి గంటకు దాదాపు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది. దీని కోసం ప్రత్యేక నీటి నిల్వ సౌకర్యాలు నిర్మిస్తారు. అలాగే ఒక్కో హైడ్రోజన్ రైలు ఖరీదు దాదాపు రూ.80 కోట్లుగా ఉంటుందని అంచనా.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి