కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మొదట బౌలింగ్ ఎంచుకోవడం జట్టుకు సరైన నిర్ణయంగా నిలిచింది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ 132 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్ తో భారత్ విజయం సునాయాసంగా ముగిసింది. పవర్ ప్లేలో సంజూ 20 బంతుల్లో 26 పరుగులతో మంచి ఆరంభం ఇచ్చి ఆడుతున్నప్పటికీ జోఫ్ర బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 3వ నెంబర్ లో వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా అదే ఓవర్లో డక్ అవుట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు.
చెలరేగిన భారత బౌలింగ్ యూనిట్
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన బౌలింగ్‌తో మెరిశాడు, 3/23 గణాంకాలతో ఇంగ్లాండ్‌కు భారీ దెబ్బతీశాడు. అతనికి తోడు అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ నాశనం అయ్యింది. ఇంగ్లాండ్ తరఫున జోస్ బట్లర్ ఒక్కడే జట్టును కొంతవరకు నిలబెట్టాడు. అతను 44 బంతుల్లో 68 పరుగులు చేయగా, ఇద్దరు బ్యాటర్లు మినహా ఇంకెవరు రెండు అంకెల స్కోరును కూడా దాటలేకపోయారు.
భారత స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో ప్రధాన పాత్ర పోషించారు. వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ స్పిన్ విభాగాన్ని బలంగా నిలబెట్టారు. బౌలింగ్ ముగ్గులో నమ్మకంగా ఉన్న భారత బౌలింగ్ యూనిట్ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై 132 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది.
ఇది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌కు మంచి ప్రారంభం. ఇక రెండు జట్లు తమ ఫార్మ్‌ను పరీక్షించుకోవడమే కాకుండా, వచ్చే నెలలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి తమ బలాలను అంచనా వేయడానికి ఈ సిరీస్‌ను ఉపయోగించుకోనున్నాయి.
భారత జట్టు తమ మంచి ఫార్మ్‌ను కొనసాగించి సిరీస్‌ను ముమ్మరంగా కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది, కాగా ఇంగ్లాండ్ జట్టు తమ తొలి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
భారత్ vs ఇంగ్లాండ్ 1వ T20I ప్లేయింగ్ XIలు
భారతదేశం : అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (WK), జోస్ బట్లర్ (C), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..