ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకోబోతుంది. 42 ఏళ్ల ఓ సీనియర్ ఆటగాడు వేలం కోసం తన పేరును నమెదు చేసుకోగా.. మూతి మీద మీసం రాని ఓ 14 యేళ్ల యంగ్ టాలెంటెడ్ కుర్రాడు కూడా తన పేరు నమోదు చేసుకున్నాడు.
టోర్నమెంట్‌లోని అన్ని ఫ్రాంచైజీల్లో కలిపి 204 స్లాట్‌లు అందుబాటులో ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) విడుదల చేసిన 574 మంది ఆటగాళ్ల పూర్తి జాబితాలో 14 ఏళ్ల వండర్‌కిడ్ తో పాటు 42 ఏళ్ల అనుభవజ్ఞుడు 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో చోటు దక్కించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
IPL 2025 మెగా వేలంలో అతి పిన్న వయస్కుడు: వైభవ్ సూర్యవంశీ (14)
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాబోయే మెగా వేలం కోసం తన పేరు నమోదు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. జనవరి 2024లో, అతను ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ B మ్యాచ్లో బీహార్ రాష్ట్రం తరపున కేవలం 13 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. సూర్యవంశీ భారత అండర్ 19 తరఫున అదరగొట్టాడు. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా U19 జట్టుతో తలపడిన ఆ మ్యాచ్ లో ఒక అద్భుతమైన సెంచరీని కొట్టి మెరుపులు మెరిపించాడు.
ఆ మ్యాచ్ లో ఈ యువ ఆటగాడు 62 బంతుల్లో 104 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్ ని ముగించి యూత్ టెస్ట్ ఫార్మాట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. అంతే కాకుండా, అతను యూత్ టెస్ట్ ఫార్మాట్‌లో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీని అదే ఫార్మాట్‌లో వేగవంతమైన శతకాన్ని కూడా నమోదు చేసాడు. వేలం కోసం బీసీసీఐ విడుదల చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాలో 68వ సెట్ కింద 491వ స్థానంలో ఉన్నాడు.
IPL 2025 మెగా వేలంలో 42 ఏళ్ల దిగ్గజ ఆటగాడు: జేమ్స్ ఆండర్సన్ (42):
42 సంవత్సరాల వయస్సులో, దిగ్గజ ఇంగ్లీష్ పేసర్, జేమ్స్ ఆండర్సన్ వేలానికి వెళ్ళే ఆటగాళ్ల జాబితాలో పేరు పొందిన అత్యంత వయసు ఉన్న ఆటగాడిగా నిలిచాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ఈ ఇంగ్లిష్ వెటరన్ ఐపీఎల్‌లో తన తొలి అడుగులు వేయాలని చూస్తున్నాడు.
అతను ఇప్పటికీ ఒక ఆటగాడిగా ఇంకా క్రికెట్ ఆడాలని ఉందని ఈ మెగా టోర్నమెంట్ లో ఆడాలని ఉందని వెళ్లడించాడు. సుదీర్ఘమైన ఫార్మాట్‌లో ఆడిన అపార అనుభవం ఉన్న అండర్సన్ సేవలను ఎవరు వినియోగించుకుంటారో అని అందరు క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఉన్నారు.
షేన్ వార్న్ (708), ముత్తయ్య మురళీధరన్‌ల (800) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, ఓవరల్ ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా 704 వికెట్లతో అండర్సన్ ఆల్ టైమ్ గొప్ప బౌలర్‌లలో ఒకడిగా నిలిచాడు.