హైదరాబాద్, నవంబర్ 12: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ అటెంప్ట్ లిమిట్ పెంచుతూ ఇటీవల పై జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన మేరకు ఇకపై జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మూడుసార్లు రాసుకోవచ్చని పేర్కొంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పుర్ నవంబరు 5వ ఈ మేరకు ప్రకటించింది. అయితే దీనిపై జేఏబీ యూటర్న్ తీసుకుంది. గతంలో మాదిరిగానే ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది.. వరుసగా రెండుసార్లు మాత్రమే పరీక్షకు అనుమతి ఇస్తామని, మూడు సార్లు ఇవ్వబోమని నవంబరు 15న జరిగిన జేఏబీ సమావేశంలో నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఐఐటీ కాన్పుర్ ప్రకటన జారీ చేసింది. దీంతో మూడు సార్లు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి ఆశపెట్టి, పట్టుమని 15 రోజులు కూడాకాకముందే ఆ నిర్ణయం ఉపసంహరణ చేసుకోవడంతో సర్వత్రా చర్చ సాగుతుంది. కాగా ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే 2000 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష రాసేందుకు అర్హులని గతంలో ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు మాత్రం ఐదేళ్ల మినహాయింపు ఉంటుందని, 1995 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత పుట్టినవారు కూడా ఈసారి పరీక్ష రాయొచ్చని గతంలో చెప్పింది. ఈ సదుపాయాన్ని కూడా జేఏబీ ఉపసంహరించుకున్నట్లు తాజాగా ప్రకటించింది. 2024 మార్చి, 2025 మార్చిలో జరిగే ఇంటర్ లేదా తత్సమానమైన పరీక్షల్లో పాసైనవారు మాత్రమే వచ్చే ఏడాది మే నెలలో జరిగే జేఈఈ 2025 అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హులని స్పష్టం చేసింది. అంతకంటే ముందు ఉత్తీర్ణులైనవారికి ఈ పరీక్ష రాసే అవకాశం ఉండదన్నమాట.
జేఈఈ మెయిన్ దరఖాస్తు సవరణలకు ఛాన్స్.. చివరి తేదీ ఇదే
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. అయితే దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే సవరించుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు నవంబర్ 26, 27 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చని తెలిపింది. నవంబర్ 27న రాత్రి 11.50 గంటల వరకు అవకాశం ఉంటుంది. అయితే సవరణలు చేసుకునే అభ్యర్ధులు అదనపు ఫీజును చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే ఒక్కో అభ్యర్ధికి ఒక్కసారి మాత్రమే వివరాలు సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వివరాలను సవరించుకోవాలని ఎన్టీఏ సూచించింది.
ఇవి కూడా చదవండి