వక్రబుద్ధి మారని పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. ఎల్‌ఓసీ వెంబడి భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) దగ్గర శనివారం (ఫిబ్రవరి 8) గస్తీ తిరుగుతున్న భారత సైనికులపై పాకిస్తాన్ భూభాగం నుంచి కాల్పులు జరిగాయి. భద్రతా అధికారుల సమాచారం ప్రకారం, భారత సైనికులు వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారు. దీని కారణంగా దాడి చేసిన ఉగ్రవాదులు వెనక్కి తగ్గారు. ఈ సంఘటనలో ఎటువంటి నష్టం జరిగినప్పటికీ, సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని భారత ఉన్నతాధికారులు ఆదేశించారు.
వేసవిలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు చేయడానికి పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్ ప్యాడ్‌లలో దాదాపు 80 నుండి 100 మంది ఉగ్రవాదులను సిద్ధంగా ఉంచిందని భారత నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఏదైనా చొరబాటు ప్రయత్నాన్ని వెంటనే తిప్పికొట్టడానికి సైన్యం, భద్రతా సంస్థలను హై అలర్ట్‌లో ఉంచారు. చొరబాట్లను నిరోధించడానికి భారత సైన్యం ఎల్‌ఓసి వద్ద గట్టి నిఘా పెట్టారు పాకిస్తాన్ సైన్యం ‘తాతిక్-I’, ‘జబ్రాన్ ఫార్వర్డ్ (GF-9838)’ నుండి కాల్పులు జరిగాయని భద్రతా అధికారులు తెలిపారు. ఆ సమయంలో భారత సైనికులు వారి పోస్ట్ దగ్గర గస్తీ తిరుగుతున్నారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల అఖ్నూర్‌లో జరిగిన మాజీ సైనికుల ర్యాలీలో పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను, లాంచ్ ప్యాడ్‌లను పాకిస్తాన్ నాశనం చేయకపోతే, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భారత సైన్యం ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని, దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడబోమని కూడా ఆయన అన్నారు. మాజీ సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశం తన సరిహద్దులను రక్షించుకోవడానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని ఆయన వారికి హామీ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..