ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు భక్తుల తాకిడి కొనసాగుతోంది. సాధారణ భక్తజనంతో పాటు సాధు ,సంతువులతో అధ్యాత్మిక నగరి కిటకిలాడుతోంది. భారీగా తరలివస్తున్న భక్తులతో త్రివేణి సంగమంలో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతోంది. భక్తుల భజనలు, హర్ హర్ మహాదేవ్ నామస్మరణతో ప్రయాగ్‌రాజ్ మార్మోగుతోంది. ఇక కుంభమేళాకు వస్తున్న చిత్రవిచిత్ర బాబాలు నెట్టింట వైరల్ అవుతున్నారు.
Muscular Baba
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ‘మహా కుంభమేళా’ భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంది. ఈ మహా కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి రకరకాల బాబాలు, సాధువులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో చిత్ర విచిత్రమైన బాబాలు భక్తులను ఆకట్టుకుంటున్నారు. వారిని దర్శిచేందుకు భక్తులు సైతం క్యూ కడుతున్నారు. ఒకరు తలపై బార్లీ పంట సాగుచేస్తుంటే.. మరొకరేమో సంవత్సరాలుగా స్నానమే చేయలేదు. 45 కిలోల బరువున్న రకరకాల రుద్రాక్షలు ధరించిన వారు మరొకరు.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు కాస్తపెద్దగానే ఉంటుంది. అయితే తాజాగా రష్యన్ బాబాగా పిలువబడే మరో బాబా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ బాబా కథాకమామీషు ఏంటో తెలసుకుందాం.
మహాకుంభ మేళాలో రష్యాకు చెందిన ‘బాహుబలి బాబా’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖవర్ఛస్సుతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటున్నారు. అందుకే అందరూ ఆయన్ను ‘బాహుబలి బాబా’ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈయన సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు. రష్యాలో ఉపాధ్యాయుడైన ఈయన ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా తిరిగారు. ఈ క్రమంలోనే 30 ఏళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సనాతన ధర్మంతో ఇక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది. హిందూధర్మం గొప్పతనాన్ని గ్రహించి వెంటనే దాన్ని స్వీకరించారు. తన పేరును ఆత్మప్రేమ్ గిరి మహరాజ్‌గా మార్చుకున్నారు. భారత్‌లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు, ఇతిహాసాలను చదివాక నేపాల్‌కు వెళ్లి అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. కుంభమేళా, మహాకుంభ మేళాలు జరిగినప్పుడల్లా నేపాల్ నుంచి భారత్‌కు వచ్చి వెళ్తుంటారు. కండలు తిరిగిన దేహంతో, మెరిసే ముఖంతో ఉన్న ఈ బాబాను చూసిన మహాభారతంలోని భీముడు గుర్తుకువస్తున్నాడని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..