భారతదేశ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మరో మైలురాయిని సాధించింది. ఈ కంపెనీ భారతదేశంలో 3 మిలియన్ల కార్లను విదేశీ దేశాలకు ఎగుమతి చేసిన మొదటి తయారీదారుగా అవతరించింది. ఇటీవల గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ నుంచి సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, సియాజ్, డిజైర్ మరియు ఎస్-ప్రెస్సో వంటి మోడళ్లు ఉన్న 1,053 యూనిట్లను ఎగుమతి చేయడంతో ఈ మైలురాయిను చేరుకుంది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ఎగుమతుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Maruti Suzuki Exports
మారుతి సుజుకి కంపెనీ భారతదేశం నుంచి 1986లో వాహనాల ఎగుమతిని ప్రారంభించింది. 500 కార్లను సెప్టెంబరు 1987లో హంగేరీకి రవాణా చేసింది. కంపెనీ 2012-13 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతుల్లో 1 మిలియన్ మైలురాయిని చేరుకుంది. తర్వాత తొమ్మిది సంవత్సరాల్లో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండు మిలియన్ యూనిట్లను ఎగుమతి చేసింది. అయితే పెరిగిన తయారీ టెక్నాలజీ కారణంగా కేవలం మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లో 3 మిలియన్ల యూనిట్లను ఎగుమతి చేసింది.
మారుతీ సుజుకీ ఎగుమతులు భారతదేశ ఆటోమొబైల్ తయారీ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని, అలాగే గ్లోబల్ వేదికపై బ్రాండ్ ఇండియా పేరును నిలబెడుతున్నామని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ఎండీ అండ్ సీఈఓ హిసాషి టేకుచి స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న ‘మేక్ ఇన్ ఇండియా’ నిర్ణయం మారుతీ సుజుకీ ఈ స్థాయి కార్ల ఎగుమతులను చేసిందని వివరించారు. భారతదేశం నుంచి మన ఎగుమతులు 4 సంవత్సరాల క్రితం కంటే 3 రెట్లు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్లోబల్ డిమాండ్ నుంచి ప్రేరణ పొందిన మారుతి సుజుకి 2030-31 నాటికి వాహన ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు విస్తరించాలని నిర్ణయించుకుందని వివరిస్తున్నారు.
మారుతీ సుజుకీ సంస్థ ఈ ఏడాది అక్టోబర్‌లో అత్యధికంగా 33,168 యూనిట్ల నెలవారీ ఎగుమతులు చేసింది. ఈ కంపెనీ ప్రస్తుతం ప్యాసింజర్ వాహన విభాగంలోని మొత్తం ఎగుమతుల్లో 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఏప్రిల్, అక్టోబర్ మధ్య 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 17.4 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతానికి ఈ కంపెనీ దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి