పదిహేనేళ్లుగా అక్కడ గులాబీ గుబాళింపు ఓ రేంజ్ అన్నట్టు..! ఏ ఎన్నిక జరిగినా కారే దూసుకుపోయేది. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఒక ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో తర్జన భర్జన పడుతోంది ఉద్యమ పార్టీ. ఇంతకీ ఆ ఎన్నికేంటి? పింక్ పార్టీ సైలెన్స్‌కు కారణమేంటి..? అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల గులాబీ బాస్ కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టేంత కోపం మీద ఉన్నారని తనదైన శైలిలో విమర్శలు చేశారు. తాను కొడితే మామూలుగా ఉండదు అంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచే ప్రయత్నమూ చేశారు. ఆ నేపథ్యంలోనే పార్టీకి పట్టుకొమ్మలాంటి ఉత్తర తెలంగాణలో జరుగతున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశాన్ని మాత్రం వదిలేస్తున్నారట.
మరోవైపు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి త్వరలోనే ఎన్నికలు వస్తాయని శ్రేణులు సిద్దంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయం పట్టించుకోకుండా అసెంబ్లీ ఉప ఎన్నికలకు రెడీగా ఉండండి. స్థానిక ఎన్నికలకు సమాయత్తంగా ఉండండి అంటూ చెబుతున్నారట చిన్న బాస్. ప్రత్యర్ధులతో కలబడి నిలబడాల్సిన సమయంలో కాడెత్తేసే విధంగా మాటలు చెప్పడం వెనక దాగిఉన్న మర్మమేంటి అనేది హాట్ టాపిక్ అయింది.
పార్టీ పెద్దలు వేదికల మీద చెబుతున్న దానికి గ్రౌండ్‌లో ఉన్న రియాల్టీకి సరిపోవడం లేదట. లేకపోతే పార్టీకి గుండెకాయ లాంటి చోట జరుగుతున్న ఎన్నికలను గులాబీ పార్టీ ఎందుకు నెగ్టెక్ట్ చేస్తుంది..? టైట్ ఫైట్ ఇవ్వాల్సిన చోట పెద్ద లీడర్లు లైట్ అన్నట్టుగా ఎందుకు ఉంటున్నారు అనేది అర్దంగాక క్యాడర్ బుర్రలు హీటెక్కుతున్నాయట..
ఎన్నికలు వచ్చాయంటే కారు పార్టీ టికెట్ కోసం ఓ రేంజ్‌లో పోటీ ఉండేది. ఆ పార్టీకి స్ట్రాంగ్ జోన్‌గా పరిగణించే ఉత్తర తెలంగాణలో అయితే టికెట్ వస్తే అదే పదివేలు అన్నట్టుగా ఉండేది. దానికి తగ్గట్టుగానే ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీలకు మధ్యే పోటీ అన్నట్టుగా ఉండేది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. గత రెండు దశాబ్దాలుగా చాంపియన్ గా ఉన్న గులాబీ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయాలంటే గుబులు మొదలయిందట.
ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దిగకపోవడంపై పలు రకాల చర్చలు జోరందుకున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో ప్రభావం చూపించే ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అగ్రనేత కేసీఆర్ సహా హరీష్, కేటీఆర్, కవితలు ఈ స్థానం పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం.
సమకాలీన రాజకీయాల్లో సమర్దవంతమైన స్ట్రాటజీ ఉన్న నేతగా కేసీఆర్‌కు పేరుంది. సర్వేలు, ఒపినీయన్స్ ఆధారంగా పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతాడనే పేరున్న వ్యూహకర్త, ఎన్నికల్లో పోటీకి వెనుకంజ ఎందుకు వేస్తున్నారనేదీ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. వరుస ఓటముల ప్రభావం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల స్థానం ఎన్నికలపై పడిందట. అదీగాక పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం కూడా అధినేత అనాసక్తిగా ఉండటానికి ఓ కారణమంటున్నారు నేతలు.
గత మూడు నెలల నుంచే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. బీఆర్ఎస్ తరపున కూడా పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకున్నారు.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ గులాబీ పార్టీ నుంచి పోటీ విషయంలో ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో పోటీ చేద్దాం అనుకున్నవారు సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ తన ఆనవాయితికి భిన్నంగా ఈసారి నామినేషన్ల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారిని బరిలో దింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ నేతలు ప్రయత్నాలు చేశారట.
అభ్యర్థి సొంత బలానికి పార్టీ మద్దతు తోడైతే విజయం సాధించే అవకాశాలున్నాయని పార్టీ పెద్దలు కేటీఆర్, హరీష్‌లను కన్వీన్స్ చేసే ప్రయత్నాలు చేశారట. ఇదే విషయాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. పోటీ గురించి ఆయనకు వివరించే ప్రయత్నం చేయగా ఆయన మౌనమే ఆయన సమాధానం కావడంతో మిన్నకుండిపోయారట ఆ ఇద్దరు నేతలు. దీంతో చేసేదేమీ లేక ఆశలు వదులుకోవాలని ఉమ్మడి కరీంనగర్ నేతలకు సంకేతాలిచ్చేశారట.
ఇదిలావుంటే, మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించబోతుందని సోషల్ మీడియాలో హల్చల్ చేసిన గులాబీ దళం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. మరోవైపు నియోకవర్గ స్థాయిలో పట్టించుకోవాల్సిన ఇంచార్జీలు నేతలు తమకేం పట్టనట్టు ఉండటం… ఇప్పుడు పార్టీ కీలకమైన ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో నవ్వే వారి ముందు బొక్కా బోర్లా పడ్డట్టుగా మారిందట గులాబీ పార్టీ చోటా మోటా నేతల పరిస్థితి. పైగా అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో ఉంటే తమను మాత్రం స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని లీడర్లు పిలుపు నివ్వడంతో పుండు మీద కారం చల్లినట్టుగా మారిందట.
అయితే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి వెనుకంజ వేయడం వెనక వేరే వ్యూహాలు ఉన్నాయట ఆ పార్టీకి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే వ్యయప్రయాసలతో కూడి వ్యవహారం కావడం.. నాలుగు ఉమ్మడి జిల్లాలకు తెలిసిన నేత దొరక్కపోవడం ఓ కారణమంటున్నారు. అదీగాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో కొన్ని ఉద్యోగాలు ఇవ్వడంతో గ్రాడ్యుయేట్స్ ఆ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నారనే నిర్దారణకు వచ్చారట గులాబీ బాస్. మూడు నెలల క్రితం నిర్వహించిన ఓ సర్వే రిజల్ట్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో బరిలోకి దిగడం లేదనే ప్రచారం సాగుతుంది. మరోవైపు, బీఆర్ఎస్ టికెట్ ఆశించిన నేతలు ఇప్పుడు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్నారు. ఫిబ్రవరి పది వరకు నామినేషన్స్ గడువు ఉంది. చూడాలి మరీ చివరి క్షణంలో ఏ నిర్ణయం వస్తుందో..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..