బెంగళూరు, జనవరి 24: కొత్త ఏడాది ప్రారంభమై నెల రోజులు గడవక ముందే బెంగళూరులో తొలి మంకీ ఫాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి Mpox పాజిటివ్ నిర్ధారనైంది. ప్రస్తుతం అతడిని విక్టోరియా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దుబాయ్ నుంచి బెంగళూరు విమానంలో వచ్చిన అతడి కాంటాక్ట్ లిస్ట్‌ను అధికారులు ట్రాక్ చేసే పనిలో పడ్డారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
గతేడాది ఆఫ్రికాలోని సుమారు 15 దేశాలు ఈ ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌తో పోరాడాయి. దీంతో 2024 ఆగస్టు మధ్యలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కాగా మంకీ వైరస్ మొదటిసారి సెప్టెంబర్ 2023లో కాంగోలో బయటపడింది. స్వీడన్, థాయ్‌లాండ్‌తో సహా పలు దేశాల్లో ఈ వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందాయి. ఇటీవల, బ్రిటన్ ఆరోగ్య భద్రతా ఏజెన్సీ (UKHSA) కూడా ఇంగ్లాండ్‌లో మరో mpox వేరియంట్ క్లాడ్ Ib కేసు నమోదైనట్లు నివేదించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ దేశంలో ఇది ఆరో కేసు. క్లాడ్ 1b అనేది ప్రాణాంతకమైన Mpox జాతికి చెందిన వేరియంట్. ఇది పిల్లలపై అధిక ప్రభావం చూపుతుంది. గతేడాది మనదేశంలో మూడు Mpox మంకీ ఫాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ క్లాడ్ IIbకి చెందినవి.
Mpox లక్షణాలు జ్వరం, ఒంటిపై బొబ్బలు, శోషరస గ్రంథుల వాపు, మలంలో రక్తస్రావం.. వంటివి కనిపిస్తాయి. మంకీపాక్స్ వైరస్ (MPXV) ఇన్ఫెక్షన్‌లు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు వారిపై దాడిచేస్తాయి. Mpox నివారణకు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్‌ను 4 వారాల వ్యవధిలో 2-డోస్‌లు ఇంజెక్షన్‌గా ఇవ్వవచ్చు. మంకీపాక్స్ వైరస్.. ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. ఇది సోకిన వారితో, కలుషితమైన పదార్థాలతో, వ్యాధి సోకిన జంతువుల ద్వారా ప్రత్యక్షంగా మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారిలో 2 నుండి 4 వారాల వరకు.. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, బలహీనత, శోషరస కణుపుల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.