తిరుపతి.. టెంపుల్ సిటీ. ఇక్కడ ఉండాలన్నా, అధికారిగా పని చేయాలన్నా ఎంతో మందికి ఇంట్రెస్ట్. ఇక్కడికి వచ్చేందుకు లాబీయింగ్ చేసి మరి తిరుపతి పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తారు. అయితే అలా వచ్చిన వారంతా కొందరు బాగానే ఉన్నా.. బ్యూరోక్రాట్స్ పరిస్థితే భిన్నంగా ఉంటోంది. రాజకీయ రంగప్రవేశం చేసిన ఎన్టీఆర్, చిరంజీవి ఇద్దరు తిరుపతిలోనే పార్టీ ప్రకటించి పొలిటికల్‌గా సక్సెస్ అయినా.. తిరుపతికి వస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఏదో తెలియని భయం వెంటాడుతోంది. ఇదంతటికీ కారణం గత కొద్దికాలంగా జరుగుతున్న పరిణామాలే. కొంతమంది కింది స్థాయి సిబ్బందికి సైతం తిరుపతిలో పని చేయడం కత్తి మీద సాములాంటిదే. అందుకే తిరుపతిలో పని చేయాలన్న కోరిక ఎంత ఉంటుందో అంతే భయం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైందన్నది మాత్రం వాస్తవం. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌లకు సవాలుగా మారింది. తిరుపతి సెంటిమెంట్ అంత మంచిది కాదేమో ఆన్న చర్చ జోరుగా సాగుతుంది.
జీవితంలో ఒక్కసారైనా తిరుపతికి రావాలని శ్రీవారిని దర్శించుకోవాలని అనుకునే భక్తుల ఆశ ఎంతగా ఉంటుందో.. తిరుపతిలో పని చేయాలన్న కోరిక అధికారుల్లో ఉండడం సహజమే అయినా.. జరుగుతున్న పరిణామాలు, బదిలీలు, సస్పెన్షన్లు పనిచేయడం అసాధారణమన్న రీతిలో ఉంది. తిరుపతికి వస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌ల నుంచి కొందరు కిందిస్థాయి ఉద్యోగులు సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. తిరుపతిలో పని చేసే అధికారులకు పలుకుబడి, అదేస్థాయిలో ఆయా శాఖల్లో లాబీయింగ్‌కు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే సమస్యలు వస్తే మాత్రం బలికాక తప్పని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిణామాలే గత కొన్ని రోజులుగా తిరుపతి సెంటర్‌లో ఉన్నతాధికారులు ఎదుర్కొంటున్న దుస్థితి ఏర్పడింది. గత ఏడాది కాలంగా తిరుపతిలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు సహా ఇతర అధికారులపై వచ్చిన అభియోగాలు, ఆరోపణలు, చర్యలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. 2022 తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అంటకాగారని ఐఏఎస్ అధికారి పీఎస్ గిరిషా, ఐపీఎస్ రమేష్ రెడ్డిపై వేటు పడగా.. మరికొందరు పోలీసు, రెవెన్యూ అధికారులపైనా వేటు పడింది. ఇక 2024 ఎన్నికల తర్వాత టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కొత్త ప్రభుత్వంలో ఒక్కరోజు పని చేయకుండానే వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో పాటు కలెక్టర్ లక్ష్మీషాపైనా అప్పట్లో వేటు పడింది.
తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి శాలువా కప్పి సన్మానించడం, ఎన్నికలకు ముందు పట్టుబడ్డ వైసీపీ ఎన్నికల సామాగ్రి కేసు విషయంలో సరైన చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలతో ఈసీ బదిలీ చేసింది. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బదిలీ కావడంతో వచ్చిన మల్లికా గార్గ్ స్థానిక నేతలకు పొసగక ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్పీ మల్లికా గార్గ్‌ల పనితీరు పట్ల ఆరోపణలు లేకపోయినా ఆమె ముక్కుసూటితనం శాపంగా మారి 20 రోజులకే రాజకీయ బదిలీకి గురయింది. ఇక ఆమె తర్వాత ఎస్పీగా వచ్చిన కృష్ణకాంత్ పటేల్ పరిస్థితి కూడా అదే. ఎలక్షన్స్ స్ట్రాంగ్ రూమ్ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనతో ఈసీ బదిలీ వేటు వేసింది. ఆ ఘటనకు సంబంధించే చంద్రగిరి డిఎస్సీ, స్పెషల్ డిఎస్పీలు సైతం బదిలీకి గురికాగా ఆ తరువాత ఎస్పీగా వచ్చిన హర్షవర్ధన్ రాజు 2 నెలలే పనిచేయాల్సి వచ్చింది. బదిలీకి కారణాలు లేకపోయినా.. తెలంగాణ క్యాడర్ చెందిన సుబ్బరాయుడు తిరుపతి ఎస్పీగా వచ్చారు. ఆరు నెలలు తిరగకముందే ఎస్పీ సుబ్బారాయుడు బదిలీ కావాల్సి వచ్చింది.
ఈ నెల 8న జరిగిన తొక్కిసలాట ఘటన ఒక ఐఏఎస్ ఇద్దరు ఐపీఎస్ మెడకు చుట్టుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రాంతంలో జరిగిన ఘటనలో 6 మంది భక్తులు చనిపోవడంతో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో పాటు ఐఏఎస్ అధికారిణి టీటీడీ జేఈవో గౌతమి, ఐపీఎస్ అధికారి టీటీడీ సీవీఎస్వో బదిలీ శ్రీధర్‌పై బదిలీ వేటు పడింది. ఈ ఘటనలో డీఎస్పీ రమణ కుమార్, టీటీడీ ఉన్నతాధికారి హరినాథ్ రెడ్డి సస్పెండ్‌కు గురయ్యారు. ఇప్పుడు తిరిగి తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టడం చర్చగా మారింది. ఇలా వచ్చిన అధికారులు అలా వెను తిరగాల్సిన పరిస్థితి హాట్ టాపిక్ కాగా.. 6 నెలల్లోనే రెండోసారి తిరుపతికి వచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి సెంటిమెంట్ ఎంత మేర పనిచేస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి