జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో మిస్టరీ వ్యాధితో వరుస మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ గత నెలలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మిస్టరీ మరణాలకు అంటు వ్యాధికారకమన్న వాదనను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం తోసిపుచ్చారు. విషపదార్థాల కారణంగా అక్కడ వరుస మరణాలు సంభవించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. లక్నోలోని CSIR ల్యాబ్ నిర్వహించిన ప్రాథమిక విచారణ ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లో సంభవించిన మరణాల వెనుక ఎటువంటి ఇన్ఫెక్షన్, వైరల్, బ్యాక్టీరియా లేనట్లు నిర్ధారించారు. నమూనాల్లో విషపదార్ధాలు కనిపించాయి. అయితే అది ఎలాంటి టాక్సిన్ అని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోందని ఆయన మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, ఏదైనా కుట్ర ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కాగా రాజౌరిలోని మారుమూల బధాల్ గ్రామంలో డిసెంబర్ 7 నుంచి జనవరి 19 వరకు 3 కుటుంబాలలో వరుస మరణాలు సంభవించాయి. దీంతో అధికారులు ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రజల్లో భయాందోళనలను అరికట్టడానికి పబ్లిక్, ప్రైవేట్ సమావేశాలపై నిషేధాజ్ఞలు విధించారు. ప్రస్తుతం మరో నలుగురు వ్యక్తులతోపాటు మృతుల కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 11 మంది సభ్యులతో కూడిన అంతర్ మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. జమ్మూలోని SMGS ఆసుపత్రిలో తాజాగా ఓ బాలిక అనారోగ్యంతో మరణించడంతో మరణాల సంఖ్య 17కి చేరింది. ఈ క్రమంలో కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యక బృందం ఆదివారం రాజౌరి జిల్లాకు చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
తొలుత అక్కడి రోగులు జ్వరం, కండరాల నొప్పులు, వికారం, తీవ్రమైన చెమటలు, స్పృహ కోల్పోవడం వంటి వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే వారంతా మరణిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలోని నీరు, ఆహారం వంటి పలు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా.. వాటిల్లో విషపదార్ధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడి స్థానికంగా ‘బవ్లీ’ అనే అక్కడి నీటి బుగ్గను అధికారులు సీజ్ చేశారు. దీనిపై సీనియర్ ఎపిడెమియాలజిస్ట్, జీఎంసీ రాజౌరిలోని కమ్యూనిటీ మెడిసిన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ షుజా ఖాద్రీ మాట్లాడుతూ.. ఈ గ్రామంలో మరణాలు అంటువ్యాధి కారణంగా సంభవించలేదన్నారు. ఆహార పదార్థాలలో విషాన్ని గుర్తించామని, స్క్రీనింగ్ కోసం 200 కంటే ఎక్కువ ఆహార నమూనాలను దేశవ్యాప్తంగా ఇన్‌స్టిట్యూట్‌లకు పంపినట్లు తెలిపారు. వారం లేదా 10 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. అప్పటి వరకు గ్రామంలో తదుపరి మరణాలు సంభవించకుండా కట్టడి చేస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇవి బ్యాక్టీరియా, వైరల్ వల్ల సంభవించిన మరణాలు కావని, మృతుల శాంపిల్స్‌లో న్యూరోటాక్సిన్‌లు కనిపించాయని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా దృవీకరించింది. దీనిపై దర్యాప్తు చేయడానికి సిట్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మరోవైపు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంగళవారం బాధిత గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజలను పరామర్శించారు. మరణాల వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.