ఆధ్యాత్మిక ప్రదేశాలు.. పర్యాటక ప్రాంతాలుగా కూడా విరాజిల్లుతుంటాయి. కానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశం ఇప్పుడు కేవలం ఓ పర్యాటక ప్రాంతంగా.. వెడ్డింగ్ ఫోటో షూట్ వేదికగా మిగిలిపోయింది. చుట్టూ కొండలు.. పచ్చని ప్రకృతి.. 250 ఏళ్లకు పైగా చరిత్ర.. అద్భుత శిల్పం.. వెరసి ఆ గుడి పంచభూతాలకు సాక్షీభూతంగా నిల్చిన ఓ రమణీయ దృశ్యకావ్యం. కానీ, ఆ గుడి వెనుక ఓ పెద్ద మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ ఏంటో ఆ కుటుంబ వారసులకూ ఇప్పటికీ సరిగ్గా తెలియకుండా పోయింది. స్థానికులకు అంతకన్నా తెలియదు. అసలేం రహస్యముందనేది.. ఇప్పటికీ పెద్దపెల్లి జిల్లాలో కొలువైన.. ఇదిగో ఈ ఆలయంలో ఇక్కడి ప్రతిష్ఠించాల్సిన ఆండాళమ్మను ప్రతిష్ఠించకపోవడం వెనుక కారణమేంటో ఎవ్వరికీ తెలియదు.
ఆండాళమ్మ ఆలయంలో ప్రస్తుతం ఓ హనుమాన్ విగ్రహాన్ని ఎవరో తీసుకొచ్చి పెట్టి.. ఓ విగ్రహముండాలన్నట్టుగా చిన్నగా నిలబెట్టారు. కానీ, ఈ పురాతమైన అద్భుత శిల్పంలో మనకు గోపురంతో పాటు.. ఆలయ ఎంట్రన్స్ లో కనిపించే కమాన్ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో ఆండాళమ్మ కోసం 250 ఏళ్ల క్రితమే నిర్మించిన ఈ ఆలయంలో ఆ దేవతను ఎందుకు ప్రతిష్ఠంచలేదు..? ఆండాళమ్మ ఆలయానికి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఇదే ధర్మాబాద్ లో ఇదిగో 450 ఏళ్ల క్రితం కట్టిన మరో ఆలయాన్ని మనం ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. రంగనాయకస్వామి ఈ ఆలయం కూడా పురాతన శిల్పానికి ఓ ప్రతీకలా ఈ పచ్చని ప్రకృతిలో అలరిస్తోంది. ఏవో ధూప, దీప నైవేద్యాలు మినహా.. ఈ ఆలయానికి ఆదరణ కరువైందనే చెప్పాలి. ఎక్కడ చూసినా చిత్తడితో.. పెద్దపెల్లి జిల్లా కేంద్రానికి కేవలం ఓ నాల్గు కిలోమీటర్ల దూరంలో కనిపించే ఈ ఆలయాలను ఇక్కడి పాలకులుగానీ, ఎండోమెంట్ అధికారులుగానీ.. ఇతరులుగానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పైగా రంగనాయక స్వామి ఆలయాన్ని పురావస్తుశాఖకు అప్పగించాక.. దీని బాగోగులు చూసేవారే కరువయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ రంగనాయకస్వామి ఆలయాన్ని ఎరబాటి వంశస్తులు నిర్మించారు. ఈ ఆలయానికి సంబంధించిన సుమారు 450 ఎకరాల భూములను కూడా ఇక్కడి పెద్దలు కబ్జా చేసినట్టుగా కూడా ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఎరబాటి వంశస్తులే ఈ రంగనాయకుడికి దగ్గరలో.. ఇదిగో మిస్టరీగా మిగిలిపోయిన ఈ ఆండాళమ్మ ఆలయాన్ని నిర్మించారు.
ఎరబాటి వంశస్తులకు రంగనాయకుడి ఆలయం నిర్మించిన తర్వాత.. స్వయానా స్వామే కలలోకొచ్చి ఆండాళమ్మ ఆలయాన్ని నిర్మించాలని చెప్పినట్టూ ఓ ప్రచారముంది. దాని ప్రకారమే ఈ గుడిని కట్టినప్పటికీ… ఆలయ నిర్మాణమనంతరం ఎరబాటి వంశస్తుడైన లక్ష్మీకాంతరావు తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు. ఆ తర్వాత ఈ ఆలయంలో ఆండాళమ్మను ప్రతిష్ఠించేందుకు ఎరబాటి వంశస్తులుగానీ.. ఇంకెవ్వరూగానీ ప్రయత్నం చేయలేదు. అద్బుతమైన ఆలయాన్ని నిర్మించి.. ఆండాళమ్మను ఎందుకు ఇంకా ప్రతిష్ఠించలేదన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు ఈ ఆండాళమ్మ ఆలయం ప్రీవెడ్డింగ్ షూట్స్ కు కేరాఫ్ గా మారింది. మొత్తంగా ఓ దృశ్యకావ్యంలా కనిపించే ఓ దేవతలేని ఆలయంలో.. ఆ దేవతనెందుకు ప్రతిష్ఠించలేదనే ఈ రహస్యం ఇప్పట్లో వీడేలా లేకపోగా.. భవిష్యత్ తరాలకూ ఓ మిస్టరీగానే మిగిలిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి