ఛత్తీస్‌ఘఢ్ క్యాడర్ మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మల్కన్‌గిరి సుకుమా బోర్డర్‌లో వరుస ఎన్‌కౌంటర్లతో పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. అయితే ఇటీవల ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల్లో ఏవోబీలోకి చొరబడినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మరింత అప్రమత్తమయ్యాయి భద్రతా బలగాలు. అయితే తాజాగా అల్లూరి జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంతరిస్తున్నట్లు సమాచారం భద్రత బలగాలు అందింది. దీంతో అప్రమత్తమైన బలగాలు.. అనుమానాస్పదంగా వెళుతున్న మావోయిస్టును చాకచక్యంగా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని కూపీలాగడంతో భారీగా పేలుడు పదార్ధాలు బయటపడ్డాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లేరు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టు ఎసిఎం, యాక్షన్ టీం కమాండర్ కొవ్వాసి సోమడ అలియాస్ ముకేష్‌ను చింతూరు పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన సుక్మా జిల్లా కొంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోంపాడ్ గ్రామానికి చెందిన సోమడ(33)గా పోలీసులు గుర్తించారు. 14 ఏళ్ల వయసులో కొంట ఏరియా కమిటీ కమాండర్ అయిన వెట్టి మంగుడు అగ్రికల్చర్ టీంలో పార్టీ మెంబర్ గా నియమించారు. సెప్టెంబర్ 2016 వరకు అక్కడే కొనసాగాడు. 2016 సెప్టెంబర్‌లో బూరకలంక అటవీ ప్రాంతంలో మిలిటరీ ట్రెయినింగ్‌లో పాల్గొన్నాడు. ఇతనితో పాటు 40 మంది పార్టీ సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.
ఆ తరువాత CNM ఇంచార్జి అయిన మడకం అర్జున్‌కు గన్‌మేన్‌గా పని చేశాడు. ఆ సమయంలో ఇతనికి సింగల్ షాట్ ఆయుధం కేటాయించారు. అప్పటినుండి డిసెంబర్ 2018 వరకు కొనసాగాడు. అనంతరం కొంటా ఏరియా కమిటీలోకి చేరిన సోమడ, అప్పటి నుండి నవంబర్ 2023 వరకు కొనసాగాడు. డిసెంబర్ 2023లో కొంట ఏరియా కమిటీ యాక్షన్ టీం కు డిప్యూటీ కమండర్ గా నియమితులయ్యాడు. తరువాత అదే నెలలో ACM గా పదోన్నతి పొంది.. మార్చి 2024 లో కొంట ఏరియా కమిటీ యాక్షన్ టీం కు కమాండర్ గా నియమితులయ్యాడు. ఇప్పటి వరకు 17 వేర్వేరు కేసుల్లో సోమడ నిందితుడుగా ఉన్నాడు. పక్కా సమాచారంతో సోమడను పట్టుకున్నారు పోలీసులు. అతని నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 5 ఎలక్ట్రికల్ డెటోనేటర్లు, 2 హ్యాండ్ గ్రనేడ్లు, ఐరన్ ముక్కలు, బ్యాటరీ, మూడు మీటర్ల కార్డెక్స్ వైరు, అయిదు మీటర్ల ఎలక్ట్రికల్ వైరు, స్టీల్ క్యాన్ స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.
భద్రత బలగాలే టార్గెట్‌గా సోమడ పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు సోమడను అరెస్ట్ చేశారు. నవంబర్ నెలలో ఛత్తీస్‌ఘడ్ ఒరిస్సా బోర్డర్‌లో ఎదురు కాల్పులు జరిగాయి.. ఆ సమయంలో తప్పించుకున్న కొంతమంది మావోయిస్టులు ఏవోబిలోకి వచ్చినట్లు సమాచారం ఉంది. తాజాగా చలపతి ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టుల్లో భయం పెరిగింది. ఈ క్రమంలో మారుమూల ప్రాంతం నుంచి బయటకు వచ్చి సోమడ పట్టుబడ్డాడని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..