నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. నువ్వుల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. నువ్వులను చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. నువ్వులతో చేసిన వంటలు చాలా రుచిగా ఉంటాయి. నువ్వులతో చేసే స్నాక్స్‌లో నువ్వుల బర్ఫీ కూడా ఒకటి. దీన్నే నువ్వుల చిక్కీ అని కూడా అంటారు. పిల్లలకు నువ్వులతో చేసే ఆహారాలు అందిస్తూ ఉండాలి. నువ్వులతో చేసే ఈ చిక్కీని చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నువ్వుల చిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
నువ్వుల చిక్కీకి కావాల్సిన పదార్థాలు:
నువ్వులు, బెల్లం లేదా పంచదార, నెయ్యి, యాలకుల పొడి.
నువ్వుల చిక్కీ తయారీ విధానం:
ముందుగా ఓ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత అందులో నువ్వులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో లోతైన గిన్నె తీసుకుని మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం తీసుకుని పాకం పట్టాలి. కొద్దిగా నీటిలో బెల్లం వేసి లేత పాకం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం నెయ్యి, యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి.
ఇవి కూడా చదవండి
ఆ తర్వాత వేయించిన నువ్వులను కూడా పాకంలో వేసి అంతా కలిసేంత వరకు తిప్పాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో నెయ్యి రాయాలి. ఈ ప్లేట్ మీద పాకం వేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక మీకు కావాల్సిన సైజులో కట్ చేయాలి. అంతే ఎంతో హెల్దీ అంట్ టేస్టీ నువ్వుల చిక్కీ సిద్ధం. ప్రతి రోజూ ఓ చిన్న ముక్క పెద్దలు, పిల్లలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భిణీలు తింటే మరింత మంచిది. బిడ్డ ఎదుగుదలకు సహాయ పడుతుంది.