వన్ నేషన్- వన్ ఎలక్షన్.. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం జమిలి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. జమిలి ఎన్నికల బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పాటైంది.. జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగ విరుద్దమని ప్రతిపక్షం వాదిస్తుండగా.. జమిలితో ఎన్నో ప్రయోజనాలున్నాయని కేంద్రం చెబుతోంది.. ఈ తరుణంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక వల్ల భారత్‌కు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఇది సుపరిపాలనకు కొత్త నిర్వచనాన్ని ఇస్తుందన్నారు. పాలనలో సుస్థిరతతోపాటు విధానాల్లో అనిశ్చితిని తొలగించడానికి, వనరులు పక్కదోవ పట్టడాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. ప్రభుత్వంపై ఆర్థిక భారాలను తగ్గించడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ దోహదపడుతుందన్నారు.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. గత 75 ఏళ్లలో దేశం సాధించిన పురోగతిని ముర్ము ప్రస్తావించారు. సుసంపన్న, సమ్మిళిత భారత్ సాకారానికి పౌరులందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంచ ఆర్థిక ధోరణులను ప్రభావితం చేస్తుందని ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
ప్రపంచంలోనే కీలక ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని.. వివరించారు.. సరిహద్దులను కాపాడుతున్న సైనికుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష రంగంలో పెద్ద ఎత్తున దూసుకుపోతోందని అన్నారు. వాతావరణ మార్పులు.. ప్రపంచ ముప్పును ఎదుర్కొనేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి పౌరులకు పిలుపునిచ్చారు.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం నిలకడగా ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకున్నదని, 2020లో 48వ స్థానం ఉండగా.. దాని నుంచి 2024లో 39వ స్థానానికి చేరుకుందని ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని ముర్ము సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తిని పునరుద్ధరించడానికి, ప్రపంచ దేశాల్లో తన హోదాను తిరిగి సాధించడానికి భారత్ ఈ 75 ఏళ్లలో కృషి చేసిందని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ సభలో విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. 15 మంది మహిళా సభ్యులు అందులో ఉన్నారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య కార్యాచరణను తీర్చిదిద్దడంలో వారు కీలక పాత్ర పోషించారన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..