Pawan Kalyan: పవన్ అంటే తుఫాన్ కాదు ఇక సునామీయే.. ఉత్తరాదిన సనాతన ధర్మ శంఖారావం

2 hours ago 1

పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధినేత మాత్రమే కాదు. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) చేతిలో తిరుగులేని ప్రచారాస్త్రంగా మారారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని ప్రయోగించిన కమలనాథులు.. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరగబోయే బిహార్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కళ్యాణ్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్‌తో పాటు కోట్ల సంఖ్యలో వీరాభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్‌ తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో మాట్లాడగల సామర్థ్యం ఎన్డీఏ కూటమికి మరింత కలిసొచ్చే అంశంగా మారింది. కర్ణుడిని తలపించే దాన గుణం, ప్రజా సమస్యలపై స్పందించే హృదయం ఆయనకు సమాజంలో అనేక వర్గాల్లో అభిమానులను తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన క్రేజి తెలుగు నేలను దాటి దేశమంతటా విస్తరిస్తోంది.

ఏపీలో మొదలై.. మహారాష్ట్ర మీదుగా..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ ప్రదర్శించిన జనసేనాని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని బీజేపీకి చేరువ చేసి అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో ఎన్డీఏ ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేవలం ‘పవన్’ (గాలి) మాత్రమే కాదని, ఆయనొక ‘ఆంధీ’ (తుఫాను) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కొనియాడారు. సొంత ప్రభుత్వంలోని లోపాలను సైతం నిర్మొహమాటంగా ఎత్తిచూపుతూ పాలనలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావద్దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయమంటూ ‘వారాహి డిక్లరేషన్’ రూపొందించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పాన్-ఇండియా పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్‌గా, హిందూ ఫైర్ బ్రాండ్‌గా ఎదిగారు. ఎప్పుడూ కాషాయ వస్త్రధారణలో ఉండే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కంటే కూడా అప్పుడప్పుడూ దీక్షపూనే పవన్ కళ్యాణ్ తెచ్చుకున్న హిందూ ఐడెంటిటీ ఎన్నో రెట్లు అధికంగా ఉంది. తెలుగు సినీ రంగ దిగ్గజంగా తెచ్చుకున్న క్రేజ్ కంటే వేల రెట్లు అధిక క్రేజ్ ఆయనకు సనాతన ధర్మ పోరాటం తెచ్చిపెట్టింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఒకటేమిటి.. ఇంటర్నెట్ తెరిస్తే చాలు ఎటు చూసినా పవన్ కళ్యాణ్ ఒక ట్రెండింగ్ సబ్జెక్ట్‌గా మారిపోయారు. ఈ క్రేజ్‌ను ఓట్లుగా మలచుకోవచ్చని కమలనాథులు భావించారు. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించారు. ఆయనతో పలు సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన అడుగు పెట్టిన ప్రతి నియోజకవర్గంలో ‘మహాయుతి’ (ఎన్డీఏ) అభ్యర్థి గెలిచారు.

హిందీ నేలపై..

పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన ఎక్కడికి వెళ్లినా అభిమాన జనం ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతుంటారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా బౌన్సర్ల సహాయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అడపా దడపా ఢిల్లీకి వచ్చినప్పుడు ఢిల్లీలో నివసించే తెలుగు ప్రజలు కూడా ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీ పడేవారు. ఈ సమయంలో ఢిల్లీలో స్థానికులకు ఆయనొక పెద్ద సెలబ్రిటీ అని మాత్రమే తెలుసు. కానీ ఆయనతో కచ్చితంగా సెల్ఫీ దిగాలన్నంత అభిమానం కనిపించేది కాదు. కానీ తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు దేశంలో ఆయన ఎక్కడికి వెళ్లినా సరే బౌన్సర్లను వెంటబెట్టుకుని వెళ్లక తప్పదేమో అన్న పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన పవన్ కళ్యాణ్, తన పర్యటన కొనసాగిస్తూ మంగళవారం (నవంబర్ 26) వరుసపెట్టి పలువురు కేంద్ర మంత్రులను, ఉపరాష్ట్రపతిని కలిశారు. ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్లినా అక్కడున్న ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, విజిటర్లు పవన్ కళ్యాణ్‌తో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్, ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్, RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సాధించిన పాన్-ఇండియా క్రేజీ ఇమేజ్ ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సాధించారు. ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన పూరించిన శంఖారావం ఉత్తరాది సహా దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది. ఆ క్రేజ్‌ను ఓట్లుగా మలచుకునేందుకు కమలదళం ప్రణాళికలు రచిస్తోంది. ఢిల్లీలో 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా 3 పర్యాయాలు గెలుపొంది దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ.. ఢిల్లీ అసెంబ్లీ పీఠం మాత్రం బీజేపీకి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. ఈసారి ఎలాగైనా ఆ పీఠాన్ని దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర తరహాలో ఢిల్లీలోనూ పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేవలం తెలుగు ప్రజల ఓట్లను ఆకట్టుకోవడం కోసమే కాదు, హిందీ సమాజంలోనూ ఆయన ఏర్పర్చుకున్న క్రేజ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వ్యూహాలు రచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article