ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస విదేశీ పర్యటనలు చేస్తున్నారు. నైజీరియా, బ్రెజిల్ దేశాల్లో కార్యక్రమాలకు హాజరైన మోదీ.. ఇప్పుడు మరో దేశంలో అడుగుపెట్టారు. బుధవారం గయానాలో ప్రధాని మోదీ పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు గయానా వెళ్లారు ప్రధాని మోదీ.. 56ఏళ్ల తర్వాత గయానా వెళ్లిన తొలి భారత ప్రధాని మోదీకి.. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ – గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భారత్-గయానా మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి. హైడ్రోకార్బన్‌లు, వ్యవసాయం, మెడిసిన్స్, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, రక్షణరంగానికి సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ.. ప్రధాని మోదీని గ్లోబల్ లీడర్స్‌లో ఛాంపియన్ అంటూ కొనియాడారు..
గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ మాట్లాడుతూ.. ప్రభావవంతమైన నాయకత్వం.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించిన సహకారం కోసం ప్రధాని మోదీని ‘ప్రపంచ నాయకులలో ఛాంపియన్’ అంటూ అభివర్ణించారు. గయానా, ఇతర దేశాలలో వారి ఔచిత్యాన్ని, దాతృత్వాన్ని గమనించామని.. మోదీ పాలనా శైలి ప్రశంసనీయం అంటూ పేర్కొన్నారు.
‘‘ప్రధాని మోదీకి చాలా ధన్యవాదాలు. మీరు ఇక్కడ ఉండడం మా గొప్ప గౌరవం. మీరు నాయకులలో ఛాంపియన్. మీరు పాలనను అపురూపంగా నడిపించారు. మీరు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి వెలుగు చూపించారు.. అనేక మంది వారి స్వంత దేశంలో అవలంబిస్తున్న అభివృద్ధి కొలమానాలు .. ఫ్రేమ్‌వర్క్‌లను సృష్టించారు. చాలా వరకు గయానాలో మీకు సంబంధించినవే ఉన్నాయి..’’ –గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ప్రకటన
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారతదేశ ఇంధన భద్రతలో గయానా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ రంగంలో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తామన్నారు. గయానా ప్రజల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపునకు భారత్ గణనీయమైన కృషి చేసిందన్నారు మోదీ. ఈ ఏడాది గయానాకు భారత్ రెండు డోర్నియర్ విమానాలను సరఫరా చేసిందన్నారు.
ప్రధాని మోదీ నినాదం.. విశ్వవ్యాప్తం..
ప్రధాని మోదీ నినాదం.. ‘‘ఏక్ పెడ్ మా కే నామ్ ( అమ్మపేరుతో ఓ మొక్క)’’ ప్రపంచవ్యాప్తం అయ్యింది.. ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద జార్జ్‌టౌన్‌లో ప్రధాని మోదీ, గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ మొక్కలు నాటారు.
ప్రధాని మోదీకి డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ అవార్డు..
అనంతరం జార్జ్‌టౌన్‌లో జరిగే రెండవ ఇండియా-కారికామ్ సమ్మిట్‌కు సైతం హాజరయ్యారు.. ఈ సదస్సులో డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ మోదీకి “డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్” అవార్డును అందజేశారు. కరోనా సమయంలో మోదీ చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సదస్సులో మోదీ ఈ ప్రాంతంతో భారతదేశ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కారికామ్ సభ్య దేశాల నాయకులతో చర్చించనున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..