దేశంలోని విద్యార్థులకు కొత్త స్కీమ్ వచ్చింది. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి కేంద్రం అండగా నిలిచేందుకు సిద్ధమైంది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థులకు ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Students
విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంతో దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏడున్నర లక్షల రుణం లభించనుంది. రుణంలో 75శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. దీంతో ఏటా 22లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ది చేకూరనుందన్నారు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్. ఇందుకోసం ఏటా 3వేల 600 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామన్నారు. దరఖాస్తుకు పారదర్శక, స్టూడెంట్ ఫ్రెండ్లీ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండ్ టు ఎండ్ డిజిటల్ అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుందని చెప్పారు అశ్వినీ వైష్ణవ్. విద్యాలక్ష్మి రుణాలకు ఎటువంటి తనఖా, ష్యూరిటీలు అవసరం లేదన్నారు. రూ.8 లక్షల కుటుంబ వార్షిక ఆదాయమున్నవారు విద్యాలక్ష్మి పథకానికి అర్హులని తెలిపారు.
మధ్య తరగతి యువతకు విద్యాలక్ష్మితో అవకాశాలు పెరగనున్నాయి. అలాగే 10లక్షల వరకు రుణాలపై 3శాతం వడ్డీరాయతీ విద్యార్థులకు కల్పించనున్నారు. ఏదైనా ప్రభుత్వ స్కాలర్‌షిప్ లబ్దిదారులు ఈ పథకానికి అనర్హులని కేంద్రం తెలిపింది. విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్‌సైట్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, రుణం కోసం దరఖాస్తులు పెట్టుకోవడానికి, వడ్డీ మొత్తాన్ని చెల్లించడానికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం-విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రుణాల మంజూరు ప్రక్రియ మొత్తం కూడా ఈ పోర్టల్ ద్వారానే కొనసాగుతుంది. ఇక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మూలధన అవసరాల కోసం.. 10వేల 700 కోట్లను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..