‘రేయ్ సత్తి.. బాలు అటు వచ్చిందా?’.. విక్రమార్కుడు సినిమాలో రవితేజ గుమ్మం ఎదట నిలబడి అడిగే పిల్లవాడు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ పిల్లోడి పేరు రవి రాథోడ్. ఒక్క విక్రమార్కుడు సినిమాలోనే కాదు ఆంధ్రవాలా, ఖడ్గం, జెమిని, మాస్, బొమ్మరిల్లు, డాన్, హైదరాబాద్ నవాబు, శంకర్‌దాదా ఎంబీబీఎస్.. ఇలా దాదాపు యాభైకి పైగా సూపర్ హిట్ సినిమాల్లో రవి రాథోడ్ ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. చిన్నప్పుడే ఎంతో ఈజ్ గా నటించిన అతనిని చూసి భవిష్యత్ లో మంచి నటుడు అవుతాడనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు ఆ కుర్రాడు రోడ్లపై తిరుగుతున్నాడు. మందుకు బానిసై ఎవరు గుర్తుపట్టలేని స్థితికి మారిపోయాడు. ఒక యూట్యూబర్ రవి రాథోడ్ ను గుర్తు పట్టడం, అతనితో సంభాషణ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతని గురించి తెలిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రవి రాథోడ్ తన జీవితంలోని విషాదాన్ని అందరితో పంచుకున్నాడు. స్టార్ నటుడిగా మారాల్సిన తాను తాగి రోడ్లపై తిరగడానికి గల కారణాలను బయట పెట్టాడు.
‘నాది మిర్యాలగూడ. చిన్నప్పుడు నేను సంపాదించిన డబ్బుతోనే నాన్న ఇల్లు కట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేను నటించిన చివరి సినిమా ఎస్‌ఎమ్‌ఎస్. అప్పుడే అమ్మానాన్న, బామ్మ ఇంట్లోనే ఒంటికి నిప్పంటించుకుని చనిపోయారు. నేను షూటింగ్‌కు వెళ్లొచ్చేసరికి అందరూ శవాలై పడి ఉన్నారు. దీంతో మా ఇంటిని పిన్నిబాబాయ్ వాళ్లకు ఇచ్చేసి నేను బయటకు వచ్చేశాను. నా దీన స్థితిని చూసి రాఘవ లారెన్స్ దత్తత తీసుకున్నాడు. లక్షలాది రూపాయల ఫీజు కట్టి నన్ను స్కూల్ తో పాటు హాస్టల్ లో చేర్పించాడు. అయితే నేను ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ తర్వాత తిరిగి వెళ్లలేదు. మొన్నామధ్య సెట్‌లో రాజమౌళి సర్ నన్ను చూసి వీపుపై రెండు దెబ్బలు వేశాడు. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా అన్ని సినిమాలు చేసి సెట్‌లో ఇలా ఎందుకు పని చేస్తున్నావని తిట్టాడు. ఆరోజు షెడ్యూల్ అయ్యాక ఒకసారి కలవమన్నారు. కానీ నేనే వెళ్లలేదు’
ఇక నేను నటుడిగా కొనసాగకపోవడానికి చాలా కారణాలున్నాయి. నేను సినిమాల్లో స్థిరపడదామని అనుకున్నాను. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాను. కానీ రేపు రా, ఎల్లుండి రా.. అని తిప్పించుకున్నారు. ఇలా ఛాన్సుల కోసం అడుక్కోవడం ఎందుకని తిరగడం మానేశాను. ఇదే సమయంలో నేను మద్యానికి బానిసయ్యాను. తాగకపోతే ఏవేవో చేదు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అందుకే ఒక్క రోజు కూడా తాగకుండా ఉండలేను’ అని తన కన్నీటి గాథను పంచుకున్నాడు రవి రాజ్.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.