శాటిలైట్ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి దేశంలోని ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్ కు చేదు అనుభవం ఎదురైంది. వారు డిమాండ్ చేసినట్టు వేలంలో కాకుండా పాలనా పరంగా కేటాయింపులు జరుపుతామని కేంద్రం వెల్లడించింది. శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ కోసం స్పెక్ట్రమ్ ను వేలం వేయబోమని, పాలనా పరంగానే కేటాయింపులు జరుపుతామని కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రకటించడంతో ఈ విషయం స్పష్టమైంది. దీంతో ప్రముఖ ప్రపంచ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ కు ఇది అనుకూలంగా మారింది.
Satellite Spectrum
మన దేశంలో తన స్టార్ లింక్ సేవలను తీసుకువచ్చేందుకు ఎలోన్ మస్క్ సంస్థ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను వేలం వేయకుండా స్పెక్ట్రమ్ ను కేటాయించాలని కోరుతోంది. ప్రస్తుతం కేంద్రం నుంచి వారికి అనుగుణంగా నిర్ణయం వచ్చింది. అయితే దీన్ని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఎయిల్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యతిరేకిస్తున్నారు. వేలం ద్వారానే కేటాయింపులు జరపాలని కోరుకుంటున్నారు.ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మాట్లాడుతూ స్పెక్ట్రమ్ ను పాలనా పరంగానే కేటాయిస్తామని స్పష్టం చేశారు.
అయితే కేటాయింపులు ఉచితం కాదని, ట్రాయ్ ధరను నిర్ణయిస్తుందన్నారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) నిబంధనలను ప్రతి దేశం పాటించాలన్నారు. ఏ దేశం కూడా శాటిలైట్ స్పెక్ట్రమ్ ను వేలం వేయడం లేదన్నారు. శాటిలైట్ స్పెక్ట్రమ్ అంటే ఉపగ్రహాలు, గ్రౌండ్ స్టేషన్ల మద్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ. టెలివిజన్ ప్రసారాలు, ఇంటర్నెట్ యాక్సెస్, మొబైల్ కమ్యూనికేషన్ వంటి సేవలను సులభతరం చేయడానికి ఇవి చాలా అవసరం. ముఖేష్ అంబానీ స్పెక్ట్రమ్ వేలం విధానాన్ని కోరుతుంటే, ఎలోన్ మస్క్ మాత్రం పాలనా విధమైన కేటాయింపులు జరపాలని కోరుతున్నారు.
శాటిలైట్ సిటీ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సేవలను మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం సులభంగా అందించే వీలుంటుంది. మస్క్ కు చెందిన లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లతో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. శాటిలైట్ల ద్వారా వచ్చే సంకేతాలను భూమిపై ఉంటే రిసీవర్లు గ్రహించి ఇంటర్ నెట్ డేటాగా అందజేస్తాయి. ఇప్పటికే అనేక దేశాలలో స్టార్ లింక్ సంస్థకు మిలియన్ల మంది ఖాతాదారులున్నారు. మన దేశంలోనూ ఆ సేవలను తీసుకురావాలని మస్క్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దానికి మార్గం సుగమమైంది. అయితే స్టార్ లింక్ మన దేశంలోకి వచ్చినా లోకల్ బ్రాండ్ లతో విపరీతమైన పోటీ ఉంటుంది. ఎందుకంటే స్టార్ లింక్ చార్జీలు మనకన్నా దాదాపు పది రెట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..