నేటి రోజుల్లో అన్ని వయసుల వారికి మొబైల్ వ్యామోహం ఘననీయంగా పెరిగింది. ఎప్పుడు చూసినా చేతిలో మొబైల్ ఫోన్ కనిపిస్తూనే ఉంటుంది. రాత్రి పడుకునే ముందు రీళ్లు చూడకుంటే నిద్ర పట్టని పరిస్థితికి చేరుకున్నారు. అయితే ఇలాంటి అలవాటు ఎంత ప్రమాదకరమో చాలా మందికి తెలియదు. సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతోందని అందరికీ తెలిసిందే. కానీ మనలో చాలా మందికి రాత్రి పడుకునే ముందు రీల్స్, షార్ట్ వీడియోలు చూసే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. తాజాగా దీనిపై చైనీస్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు తెలిశాయి. అవేంటంటే..
ఈరోజుల్లో చాలా మంది ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో రకరకాల రీళ్లను చూస్తు గడిపేస్తున్నారు. ఈ అలవాటు వల్ల మీ సమయాన్ని వృథా చేయడమే కాకుండా ఒత్తిడి, నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, మెదడు దెబ్బతింటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
పరిశోధన ఏం చెబుతోంది?
చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటీ 4,318 మంది వ్యక్తులపై రోజులో ఏ సమయంలో ఎక్కువ రీల్స్‌ను చూస్తున్నారు? అనే దానిపై పరిశోధన చేయగా రాత్రిపూట ఎక్కువ మంది రీల్స్‌ను వీక్షిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ రకమైన స్మార్ట్‌ఫోన్ వాడకం నాడీ వ్యవస్థ పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలో తేలింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట ఎక్కువ సమయం రీల్స్, షార్ట్ వీడియోలను చూసే వ్యక్తులకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వీరి పరిశోధనలో తేలింది. ఈ అభ్యాసం నాడీ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందని, అనేక అవాంఛిత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
మరైతే ఏం చేయాలి?
దీని నుంచి బయటపడాలంటే నిద్రకు ముందు మొబైల్ చూడటం తగ్గించడం చాలా అవసరం. రాత్రిపూట రీల్స్ చూడటం తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుకోవడం, షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవడం, పడుకునే ముందు నిశ్శబ్ద కార్యకలాపాలను ఎంచుకోవడం ద్వారా బీపీ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.