సుమారు 42 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహా కుంభాభిషేకానికి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి క్షేత్రం ముస్తాబైంది. ఆ మహోత్తర ఘట్టానికి ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 7 నుంచి మూడు పాటు ఈ మహత్తర ఘట్టం జరుగనుంది.. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ మహోత్తర ఘట్టాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాలకె చెందిన వేలాది మందిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలసిన 1982లో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి మహా కుంభాభిషేకం జరిగింది. మళ్లీ 42 ఏళ్ల తర్వాత అలాంటి అద్భుత ఘట్టం జరగబోతుంది. నేటి నుండి మూడు రోజులపాటు అంటే ఫిబ్రవరి 7, 8 , 9 తేదీలలో ఈ శత చండి మహారుద్ర సహస్రఘట్టాభిషేక, కుంబాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ఈ విశేష కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు..
మూడు రోజుల వేడుకల్లో భాగంగా 1,180 కలశాలతో అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుష్కరఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించి వేడుకల్లో పాల్గొనే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం(ఫిబ్రవరి 7) ఉదయం మంగళ వాయిద్యాలతో పేద స్వస్తి వాచకములు, గణపతి పూజ, గోపూజ, పున్నవచనము, రక్షాబంధనం, పంచగవ్యపాషణం, అఖండ జ్యోతి ప్రజ్వలన, యాగశాల ప్రవేశంతో మహా కుంభాభిషేకానికి అంకురార్పణ జరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు దేవతాస్థాపన పూజలు హోమాలు, చండీ పారాయణం నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మరుసటి రోజు శనివారం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ప్రాతఃసూక్త మంత్ర పఠనం, ప్రాతఃకాల పూజలు, చండీ పారాయణం, మహా రుద్రాభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం మూడున్నర నుండి సాయంత్రం 6:30 వరకు హారతి మంత్రపుష్పం, చతుర్వేదసేవలు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు చేస్తారు. 9వ తేదీ ఆదివారం ఉదయం అసలు ఘట్టం ఉంటుంది.. ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు ప్రాతఃకాల పూజలు రుద్ర వాహనం, జయాధులు బలి ప్రధానం, మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నలభై రెండు నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి ఆశీర్వచనం నిర్వహిస్తారు. వేద పండితులు, రుత్వికులు గోపురం పైకి ఎక్కెలా ప్రత్యేకంగా మెట్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10:42 నిమిషాలకు కుంభాభిషేకంలో భాగంగా పీఠాధిపతులు, వేద పండితులు ప్రధాన దేవా అర్చకులు మెట్ల ద్వారా పైకి వెళ్లి అభిషేకాలు చేస్తారు. ఆలయానికి చెందిన నాలుగు గోపురాలను శుద్ధికరణ నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.
కుంభాభిషేకం జరిగే ఈ మూడు రోజులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. నిర్వాహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యలు కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహా కుంభాభిషేకం కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చే భక్తులు పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..