కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనను మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించారు. కులగణనలో 80 వేల మంది సిబ్బంది.. 10వేల మంది అబ్జర్వర్లు పాల్గొన్నారు. కులగణలో సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను, వారి ఆధార్ కార్డ్ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రతిఒక్కరి ఫోన్ నంబరు, వారుచేసే వృత్తి, ఉద్యోగ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. కులం, మతం, ఆస్తుల వివరాలను సేకరించారు. కుటుంబానికి ప్రస్తుతం ఉన్న ఆదాయమెంత? ఇంట్లో ఎంతమంది ఉంటారు.. ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారా.. ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా? మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరించారు. తర్వాత ఆ ఇంటికి స్టిక్కర్ వేస్తున్నారు. అయితే.. కులగణనలో తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తప్పవంటూ మంత్రులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా, ఇంగ్లండ్, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు ఐరోపా దేశాలకు ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్ నమోదు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఎందరు వలస వెళ్లారు.. ఏ కారణంతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించామంటున్నారు అధికారులు..
బీఆర్ఎస్ హయాంలో జరిగిన సర్వేకు ప్రస్తుతం జరుగుతున్న సర్వేకు సంబంధం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు.
ఇంటింటి సర్వేతో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు పోతాయన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సర్వే కోసం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చి సహకరించాల్ననారు.. విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ ఆర్థిక ప్రణాళికల కోసం సర్వే చేపట్టామన్నారు.
ప్రజలంతా కులగణనకు సహకరించాలన్నారు మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య. తప్పకుండా కులం వివరాలను చెప్పాలన్నారు. సిబ్బందికి పూర్తి వివరాలను ఇవ్వాలని కోరారు.
రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది కోసం కులగణన చేపట్టిందని విమర్శిస్తున్నారు విపక్ష నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..