మీరు జంతుప్రేమికులే అయ్యుండొచ్చు. ఎక్కడైనా కోతులు కనిపిస్తే వాటికి ఆహారం పెట్టి సరదా పడొచ్చు. కానీ, ఇప్పుడిలా చేసిన వారిపై కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాటికి ఎట్టిపరిస్థితుల్లో ఆహారం పెట్టకూడదని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న పని వల్ల వానరాలు తమ సహజ జీవన శైలిని కోల్పోతున్నాయిని అధికారులు వాపోతున్నారు. మనుషులు అందించే పండ్లు, కూరగాయాల్లో ఉండే హానికరమైన పెస్టిసైడ్లు ఆ మూగజీవాల ప్రాణాలు తీస్తున్నాయట. అవి అడవుల్లో సహజంగా దొరికే ఆహారాన్ని తినడం మానేసి మనుషులు పెట్టే చిరుతిళ్ల కోసం రోడ్లపై ఎదురుచూస్తున్నాయట. ఎక్కడైనా వాహనాలు కనిపిస్తే వాటి వెంట పరిగెడుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వాటికి అందించే బిస్కెట్లు, బ్రెడ్లు, ఇతర స్నాక్స్ కారణంగా అవి రోగాల పాలవుతున్నాయి. దీంతో ఇకపై ఇలా చేసే వారిపై చట్టప్రకారం కేసలు పెడతామని అధికారులు చెప్తున్నారు.
ప్రయాణికులపై దాడులు..
ఇటీవల తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లోని బీజాపూర్, భీమారం మండలాల్లో ఫారెస్ట్ అధికారులు సర్వే నిర్వహించారు. కొందరు వ్యక్తులు అడవుల్లోకి వెళ్లిమరీ వాటికి ఆహారాన్ని వేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ విషయం అధికారుల నజర్లో పడింది. మంచిర్యాల చెన్నూర్ రూట్ హైవేల్లో ఎక్కడ చూసినా కోతుల గుంపులే కనిపిస్తుంటాయట. ఆ చుట్టుపక్కల ఉన్న నిర్మల్, ఆదిలాబాద్ రూట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అవి మనుషులంటే భయం కోల్పోతున్నాయి. ఏకంగా బైక్ పై వెళ్తున్న వారిపై దాడులకు దిగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
కేసులు తప్పవు..
దీంతో ఇకపై కోతులకు ఆహారం పెట్టేవారిపై ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం నేరం కింద పరిగణించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్నేళ్లుగా కోతులకు ఆహారం పెడుతున్న మంచిర్యాలకు చెందిన సందేశ్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. అలాగే మరికొందరిపై కూడా కేసులు పెట్టి రూ. 4 వేల జరిమానా విధించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ తో పాటుగా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ చర్యలు మొదలు పెట్టారు. కఈత్రిమంగా దొరికే ఆహారం రుచి మరిగిన వానరాలు తమ ఆహారాన్ని వెతుక్కోవడం మానేస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. షాపులు, దుకాణాల్లో దాడులు చేసి వస్తువుల్ని ఎత్తుకుపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో కోతుల బెడద ఎక్కవవుతోంది. ఇది ప్రజలకే కాకుండా రాజకీయనాయకులను కూడా ఇరుకున పెడుతోంది. కోతుల బెడద తప్పించిన వారికే ఓట్లు వేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.