వనపర్తి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓ చిన్న జిల్లా. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న ప్రాంతం. అలాంటి ప్రాంతం సైబర్ మోసాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వినడానికి ఆశ్చర్యకరంగానే ఉన్నపట్టికీ ఇది నిజం. కొంతమంది చదువును మధ్యలో ఆపేసిన యువకులు ఈజీ మనీ, జల్సాలకు అలవాటు పడి ఏకంగా దుస్సాహాసమే చేశారు. అంతేకాదు ఆ విషపు అలవాటును ఇంకొంతమందికి అంటించి అమాయక ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. ఇటీవల వనపర్తి జిల్లాలో సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. లోతుగా దర్యాప్తు చేస్తే స్థానికంగా ఉంటున్న యువతే ఈ సైబర్ క్రైమ్‌లకు పాల్పడుతున్నట్లు తేలడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, తండాల యువత ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిపై నిఘా పెట్టి ఇప్పటి వరకు 31మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లి సైబర్ మోసాలపై శిక్షణ:
గ్రామీణ ప్రాంతాల్లో జల్సాలకు అలవాటుపడిన నిరుద్యోగ యువతను ఎంపిక చేసుకొని ఈ తరహా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. విలాసవంతమైన జీవనాన్ని అలవాటు చేసి సైబర్ నేరాల రొంపిలోకి దింపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కోల్ కత్తా, ఢిల్లీ, పాట్నా, యూపీ, రాజస్థాన్ ప్రాంతాలకు వెళ్లి కొంతమంది యువకులు సైబర్ మోసాలపై ట్రైనింగ్ తీసుకున్నారు. అంతేకాకుండా స్వస్థలాలకు వచ్చి మరికొంతమంది యువకులకు శిక్షణ ఇచ్చి వారి వద్ద నుంచి కొంత కమీషన్లు తీసుకుంటున్నారు. వీరంతా ధ్వని, ముద్ర పథకాలు, ఇతర బ్యాంకులు, యాప్‌లలో పెట్టుబడులు, ప్రాసెసింగ్ ఫీజులు అంటూ అమాయక ప్రజలకు వల వేస్తున్నారు. వారిని మాటల్లో పెట్టి ఖాతాల్లోని నగదును స్వాహా చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం నమోదైన సైబర్ మోసం కేసులను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహకారంతో వనపర్తి జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులోనే ఈ లోకల్ సైబర్ ముఠా తెరపైకి వచ్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు తవ్వుతున్న కొద్ది పదుల సంఖ్యలో మోసగాళ్లు పోలీసులకు చిక్కారు.
కొల్లగొట్టిన సొమ్ముతో భూములు, భవనాలు, జేసిబీలు:
ఇప్పటివరకు వనపర్తి జిల్లాకు చెందిన 31మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా చాలా మంది యువకులు ఈ సైబర్ ఊబిలో చిక్కుకొని నిందితులుగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక అరెస్టు అయిన వారు కేవలం ఈ సైబర్ నేరాలతో లక్షల రూపాయలు వెనకేసినట్లు భోగట్టా. పలువురు నిందితులు కార్లు, భూములు, జేసీబీ, భవనాల రూపంలో ఆస్తులు సైతం కూడగట్టుకున్నారు. మొత్తంగా కోట్ల రూపాయల అమాయక ప్రజల ధనాన్ని మింగేశారు నిందితులు. ఇక మొత్తం సైబర్ కేసులకు సంబంధించి పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాలు, తండాల్లో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటూ యువతకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌లు ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లంటే ఎక్కడో నార్త్, ఈశాన్య రాష్ట్రాల్లోని వారు అనుకుంటాం. కానీ వనపర్తి జిల్లా వంటి గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది యువత ఈ తరహా మోసాలకు పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. వేర్లతో సహా ఈ సైబర్ ముఠాను తొలగించకపోతే అమాయక ప్రజల ధనన్ని కొల్లగొడుతూనే ఉంటారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..