ప్రజలకు ఉచితాలు ఎర వేయడం అన్నది ప్రస్తుతం సాధారణ విషయం అయిపోయింది. ఈ ఉచిత పథకాలు భవిష్యత్‌లో పెను ముప్పుగా మారుతాయని మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వాలు దివాళా తీస్తాయన్న ఆందోళన ఒక వైపు అయితే ప్రజలను బద్దకస్తులుగా తయారు చేసినట్టు అవుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఉచితాలకు వ్యతిరేకంగా ఓ సాధారణ వ్యక్తి కూడా నినదిస్తున్నారంటే అవి ఎంత ప్రమాదకరమని ఆయన గుర్తించాడో అర్థం చేసుకోవచ్చు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాంబాబు అనే వ్యక్తి తన ఆటోపై రాయించిన నినాదం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ‘‘ఉచితాలు వద్దు.. ఉపాధి ముద్దు’’ అని రాయించిన కొటేషన్ చదవిని ప్రతి ఒక్కరూ ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. కొంతమంది అయితే ఆ ఆటో వద్ద నిలబడి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కేవలం తన తండ్రి ద్వారా సంక్రమించిన 180 గజాల స్థలంలో చిన్నపాటి నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న రాంబాబు తన ఆటోపై కోటేషన్ రాయించారంటే ఉచితాలు అనేవి ఎంత ప్రమాదకరమో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన రాంబాబు కొంతకాలం వస్త్ర పరిశ్రమలో కార్మికునిగా జీవనం సాగించాడు. అనారోగ్య సమస్య తలెత్తడంతో డాక్టర్ సలహా మేరకు సాంచా పనిని వదిలేసుకున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న రాంబాబు తన బావ ద్వారా ఆటో నేర్చుకుని ఓ ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించిన రాంబాడు ఆ పథకాలకు తాను వ్యతిరేకమని కుండబద్దలు కొట్టి మరీ చెప్పేస్తున్నారు. తల్లిదండ్రులతో పాటు తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న రాంబాబుకు ఇతరాత్ర ఆదాయ వనరులేమి లేకున్నప్పటికీ ప్రభుత్వం ఇఛ్చే ఉచిత పథకాలను వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ఉచిత పథకాల స్థానంలో ఉపాధి మార్గాలు అమలు చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. గత పదేళ్లుగా తన ఆటోపై ఈ కొటేషన్ ద్వారా తన అభిప్రాయాన్ని సమాజానికి తెలియజేస్తున్నానన్నారు. ఉచిత పథకాల విషయంలో సామాన్యులు కూడా ప్రభుత్వాలు ఆలోచన పడే విధంగా సూచనలు చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.