మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత, తెలంగాణ గ్యారంటీలపై బీజేపీ, బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మలేదని.. ఇది తెలంగాణలో మొసం చేసిందంటూ విపక్షాలు ఫైర్ అవుతున్నాయి..
Telangana Politics
కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై విపక్షాల విమర్శలు పీక్స్‌కి వెళ్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత గ్యారంటీల అమలే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ దాడి తీవ్రం చేయడం ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ కూటమి దారుణ ఓటమి మూటగట్టుకుంది. ఈ పరాజయం కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విపక్షాలకు టార్గెట్‌గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీలను ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ ప్రస్తావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీల మోసాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను మహారాష్ట్ర ప్రజలు విశ్వసించలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశంలో కాంగ్రెస్‌కు మూడు రాష్ట్రాలే మిగిలాయని.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ మోసపూరిత గ్యారంటీ హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్.. మహారాష్ట్రలోనూ అదే చేయాలని అనుకున్నారని మాజీమంత్రి హరీష్‌రావు ఆరోపించారు. అయితే మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణలో తమ ఘనత వల్లే రికార్డ్ స్థాయిలో వరి పండిందని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు హరీష్‌రావు. ఇది నిజంగా కాంగ్రెస్ ఘనతే అయితే.. గతంలో ఇంతలా వరి ఎందుకు పండలేదని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం.. కొన్ని రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీజేపీ గ్యారంటీలను ఎక్కువగా టార్గెట్ చేసింది. ఇక తెలంగాణలో గ్యారంటీ హామీలను పూర్తిస్థాయిలో ఎప్పుడు అమలు చేస్తారంటూ బీజేపీ, బీఆర్ఎస్ నిత్యం హస్తం పార్టీని విమర్శిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కాంగ్రెస్ పార్టీ మరింతగా గ్యారంటీలపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని.. విపక్షాల మాటల దాడి దీనికి సంకేతమనే చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..