కాళేశ్వరం కమిషన్ ఎంక్వయిరీ చివరి దశకు చేరుకుంది. ఈసారి రెండు నుంచి మూడు వారాలపాటు హైదరాబాద్‌లోనే ఉండి విచారణ మొత్తం పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ భావిస్తున్నారు. గతంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావులను బహిరంగ విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. ఇద్దరు నేతలకు నోటీసులు పంపేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఈఎన్సీలను మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉంది.
కాళేశ్వరం నిధుల కేటాయింపు, జీవోల జారీ, కార్పొరేషన్ ఏర్పాటు, రుణాల సేకరణ, ప్రభుత్వ ఖజానా నుంచి వడ్డీల చెల్లింపులపై గత విచారణలో కమిషన్ కీలక విషయాలు రాబట్టింది. ఇప్పుడీ అంశాలకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో ఏం జరిగిందనేది.. నాటి ఆర్థికమంత్రిగా ఉన్న రాజేందర్‌ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. బ్యారేజీల నిర్మాణాల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హరీశ్‌రావును కమిషన్ ప్రశ్నిస్తుందని తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ ఈసారి సుదీర్ఘంగా సాగే అవకాశాలున్నట్లు తెలిసింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణకు పిలిచి స్టేట్మెంట్‌లు నమోదు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత.. గత ప్రభుత్వంలో మరో కీలక నేతకు సమన్లు పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై ఇప్పటికే కమిషన్ విచారణ పూర్తి చేసింది. నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల చేసినట్లు, కాంట్రాక్టర్లను మార్చినట్లు కమిషన్ గుర్తించింది. పనులు పూర్తి కాకుండానే బిల్లులు విడుదల చేసినట్లు కమిషన్ విచారణలో తేలింది. దీంతో నిబంధనలు పాటించని అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాళేశ్వరం కమిషన్ ఒకవైపు విచారణ జరుపుతూనే.. మరోవైపు నివేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రభుత్వానికి కమిషన్ ఒక ప్రాథమిక నివేదిక అందించే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో కమిషన్ గడువు పూర్తవుతుండటంతో.. ఈలోపు పూర్తిస్థాయి నివేదిక తయారయ్యే అవకాశం లేదు. మార్చి చివరి నాటికి పూర్తి నివేదిక తయారయ్యే అవకాశం ఉండటంతో.. కాళేశ్వరం కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి